కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు అనారోగ్యం వీడటం లేదు. ఆయనకు పదే పదే శ్వాస సమస్యలు తిరగబెడుతున్నాయి. దీంతో మరోసారి ఆయన ఎయిమ్స్‌లో చేరాల్సి వచ్చింది. శనివారం రాత్రి పదకొండు గంటల సమయంలో శ్వాస పీల్చడం ఇబ్బంది అనిపించడంలో ఎయిమ్స్‌లో చేరిపోయారు. నిజానికి ఆయన గత వారమే ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆగస్టు రెండో తేదీన అమిత్ షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందారు. రెండు వారాల చికిత్స తర్వాత ఆయనకు నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు.
మళ్లీ ఆగస్టు పద్దెనిమిదో తేదీన తెల్లవారుజామున ఆయన ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో శ్వాస సమస్య ఏర్పడటం.. ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అమిత్ షాకూ అవే లక్షణాలు ఉండటంతో ముందు జాగ్రత్తగా ఎయిమ్స్‌లో చేరారు. అక్కడ నుంచే విధులు నిర్వహించారు. దాదాపుగా రెండు వారాల పాటు.. వైద్యల పర్యవేక్షణలో ఉన్న ఆయన పూర్తిగా కోలుకోవడంతో గత వారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. మళ్లీ సమస్య తిరగబెట్టడంతో ఎయిమ్స్‌లో జాయినయ్యారు.
కరోనా వైరస్ ప్రభావం శరీరంపై తీవ్రంగా ఉంటోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చికిత్స తర్వాత వైరస్‌ను శరీరం నుంచి బయటకు పంపేసినా… ఆ ప్రభావం మాత్రం కొనసాగుతోందని అంటున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై ఇది మరింత ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం అమిత్ షా.. ముందస్తు జాగ్రత్తలు.. పర్యవేక్షణ కోసమే… ఆస్పత్రిలో చేరారని.. ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు.