అమరావతి శంఖుస్థాపన, ఆయుత చండీయాగం కార్యక్రమాలతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మళ్ళీ సఖ్యత ఏర్పడింది కనుక ఇక ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులు అటకెక్కినట్లేనని అందరూ భావించారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో దాని గురించి మీడియా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశ్నించినప్పుడు, “ఎన్నికల తరువాత దాని గురించి మాట్లాడుకొందాము,”అని సమాధానం చెప్పారు. దాని గురించి ఆయన మాట్లాడకపోయినా తెలంగాణా ఎసిబి అధికారులు ఆ కేసుని మళ్ళీ అటక మీద నుంచి దుమ్ము దులిపి క్రిందకు దించారు.
ఆ కేసులో నిందితుడిగా పేర్కొన్న జెరూసలెం మత్తయ్యకు పి.ఆర్.సి.సి.సెక్షన్ 160 క్రింద నిన్న నోటీసు జారీ చేశారు. వారం రోజులలోగా తమ ముందు విచారణకు హాజరు కావలసిందిగా కోరారు. ఈసారి అతను తన లాయర్ ని వెంట తెచ్చుకోవడానికి అనుమతిచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు మత్తయ్యను అరెస్ట్ చేయబోమని కూడా తెలియజేసారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడానికే పిలుస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొనబడిన తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గ్రేటర్ ఎన్నికల ప్రచార సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసారు. ఆ ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు తను తెలంగాణాలో తెలుగు దేశం పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొంటానని, తెలంగాణాని విడిచిపెట్టే ప్రసక్తే లేదని పదేపదే చెప్పారు. బహుశః ఆ కారణంగానే మళ్ళీ ఓటుకి నోటు కేసులో మళ్ళీ కదలిక వచ్చిందేమో? కనుక రేవంత్ రెడ్డి కొంచెం వెనక్కి తగ్గి, చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాలకు, పార్టీకి దూరంగా ఉండేందుకు సిద్దపడినట్లయితే, జమ్మి చెట్టు మీద పాండవుల అస్త్రాలు దాచుకొన్నట్లుగా ఓటుకి నోటు కేసు కూడా ఎసిబి ఆటక మీద భద్రంగా ఉంటుందని భావించవలసి ఉంటుంది.