అప్పుల కోసం కేంద్రం ఎదుట మోకరిల్లకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీకే తెలిపారు. ఎఫ్ఆర్బీఎం పెంపుపై కేంద్రం పెట్టిన షరతులకు లోబడేది లేదని తేల్చి చెప్పేశారు. అసెంబ్లీలో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుల పట్టికలో తెలంగాణ 28వ స్థానంలో ఉందని.. బాధ్యతాయుతంగానే.. రాష్ట్ర ప్రయోజనాల మేరకే అప్పులు తెస్తున్నామని స్పష్టం చేశారు.
దేశంలో ఏ రాష్ట్రం సాధించని వృద్ధి రేటు తెలంగాణ సాధించిందని .. ఆత్మహత్యలు మైనస్ 45 శాతానికి పడిపోయాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేస్తుందని విపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటాయి. అయితే.. తెలంగాణ సర్కార్ చేసిన అప్పులన్నీ ప్రధానంగా కాళేశ్వరం..మిషన్ కాకతీయ వంటి భారీ ప్రాజెక్టుల కోసమే. వాటి వల్ల తెలంగాణ సంపద పెద్ద ఎత్తున పెరుగుతుంది. దీంతో అప్పులను సమర్థించుకోవడానికి తెలంగాణ సర్కార్కు అవకాశం లభిస్తోంది.
అదే సమయంలో… ఎఫ్ఆర్బీఎం పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా తెలంగాణ చేస్తోంది. కానీ కేంద్రం..చాలా షరతులు పెట్టింది. వీటికి పొరుగు రాష్ట్రం అంగీకరించినా తెలంగాణ మాత్రం ససేమిరా అంటోంది. ఆ షరతులు అంగీకరిస్తే…రాష్ట్ర అధికారాలను కేంద్రం చేతిలో పెట్టినట్లే అవుతుందని తెలంగాణ సర్కార్ అంచనాకు వచ్చింది.