భారతీయ జనతా పార్టీ మెప్పు కోసం వైసీపీతో పాటు టీడీపీ కూడా పోటీ పడి ఉత్సాహం ప్రదర్శిస్తోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకే మద్దతుగా నిలిచింది. ఎన్డీఏ తరపున జేడీ యూకు చెందిన హరి వంశ్ నారాయణ అభ్యర్థిగా నిలబడ్డారు. జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ జగన్కు ఫోన్ చేసి.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. పార్టీ ఎంపీలతో చర్చించిన జగన్.. ఈ మేరకు ఎన్డీఏకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఒకే ఒక్క ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు. ఆయన కూజా ఎన్డీఏకే మద్దతు తెలిపారు.
రాజ్యసభలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ లేదు. దీంతో వైసీపీకి ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల ఓట్లు కీలకం అయ్యాయి. అదే సమయలో టీఆర్ఎస్ ఎంపీల ఓట్లు కూడా కీలకమే. అయితే.. బీజేపీతో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ జేడీయూ అధినేత నితీష్ కుమార్తో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. మద్దతివ్వాలని అనుకోలేదు. దాంతో ఓటింగ్లో పాల్గొనకుండా గైర్హాజరయ్యారు.
ఎన్డీఏ అభ్యర్థి గెలుపు సునాయాసం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ పార్టీలతోపాటు..బీజేపీని వ్యతిరేకించే కొన్ని పార్టీలు కూడా కలిపితే ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝాను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల బరిలో నిలిపాయి. రాజ్యసభలో యూపీఏ కూటమి బలం 91మంది మాత్రమే. చివరికి బలం తేలిపోవడంతో.. ప్రత్యక్షంగా ఓటింగ్ నిర్వహించ లేదు .. వాయిస్ ఓటు ద్వారా.. ఎన్డీఏ అభ్యర్థి గెలిచినట్లుగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.