దుబ్బాక ఉప ఎన్నిక తో పాటు గ్రాడ్యుయేట్ కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే ఉపఎన్నిక బరిలో నిలవడంలో ఎలాంటి సందేహం లేదు కానీ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల విషయంలో మాత్రం భిన్నమైన చర్చ నడుస్తోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతోపాటు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైద్రబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకుముందు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మంచి ఫలితాలు రాలేదు. 2015లో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. కానీ మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ కోటాలో ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ ఓడిపోయారు.
కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు స్థానాలు గెలవాలని పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. ఈ సారి టీజేఎస్ నేత కోదండరాం బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే మరింతగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లందరూ గ్రాడ్యుయేట్లు కావడంతో నిరుద్యోగ భృతి హామీని తేల్చాలని టీఆర్ఎస్ అధిష్టానాన్ని ఎమ్మెల్యేలు కోరుతున్నట్టు తెలుస్తోంది. అటు ఇదే అంశాన్ని నినాదంగా తీసుకోవాలనే యోచనలో విపక్షాలు ఉన్నాయి. అందుకే నోటిఫికేషన్‌కు ముందే నిరుద్యోగ భృతి ప్రకటించాలనే అభిప్రాయాన్ని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్లో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. ఓటర్ల నమోదు తర్వాత అభ్యర్థులను ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కోదండరాం పోటీ చేసి.. ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెడితే.. ప్రజల్లో వేరే రకమైన ప్రచారం జరుగుతుందన్న అభిప్రాయం టీఆర్ఎస్లో ఉంది. అందుకే.. కోదండరాం అభ్యర్థిత్వాన్ని బట్టి వ్యూహం ఖరారు చేసుకోవాలనుకుంటున్నారు. అయితే.. పార్టీ సానుభూతిపరులను ఓటర్లుగా చేర్చేందుకు మాత్రం ప్రత్యేకంగా పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేస్తున్నారు.