ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలకు పార్లమెంట్ ప్రారంభమైన రోజున ఏమేం చేయాలో దిశానిర్దేశం చేశారు. దాని ప్రకారం.. ప్రత్యేకహోదాను కూడా ఎంపీలు డిమాండ్ చేయాల్సి ఉంది. అయితే.. అలాగే రాష్ట్ర ప్రయోజనాలు అంటే.. నిధులు.. ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వీటితో పాటు.. మరో రెండు, మూడు ముఖ్యమైన అంశాలపైనా ఏం చేయాలో జగన్ సూచించారు. అవి అమరావతి భూములపై సీబీఐ విచారణ జరపడం.. రెండు శాసనమండలి రద్దు బిల్లును ఆమోదింప చేసుకోవడం. అమరావతి భూముల్లో పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఎప్పట్నుంచో ఆరోపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపించలేకపోయింది. సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే.. ఏమీ దొరకలేదేమో కానీ.. సీబీఐకి ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లేఖ రాసినట్లుగా కూడా ప్రచారం జరిగింది.
అప్పుడప్పుడూ ఇంగ్లిష్ మీడియాలో… మాత్రం సిట్ విచారణలో వారి పేర్లు ఉన్నాయని.. వీరి పేర్లు ఉన్నాయని లీక్ అవుతూ ఉంటాయి. సీబీఐకి ఇవ్వాలని … ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అందుకే.. ఇందు కోసం.. పార్లమెంట్ సమావేశాలను ఉపయోగించుకోవాలని… అవినీతిని ప్రస్తావించి .. కేంద్రంతో సీబీఐ విచారణకు అంగీకరించేలా చేయాలని భావిస్తున్నారు. ఏం చేయాలో.. ఈ దిశగా ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో శాసనమండలి రద్దు విషయంలో జగన్ పునరాలోచించుకోవడం లేదని తెలుస్తోంది. ఆ మండలిని రద్దు చేయాలనే పట్టుదలతోనే ఉన్నారని చెబుతున్నారు. అందుకే.. అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన ప్రతిని.. బిల్లుగా మార్చి.. ఆమోదం పొందేలా చూడాలని ఎంపీలకు సూచించారు.
జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టమైన ఎజెండాను ఎంపీల ముందు పెట్టారు. ఎంపీలు… ఆ అంశాలను సాధించాల్సి ఉంది. కేవలం రాష్ట్ర ప్రయోజనాలకే కాకుండా.. రాజకీయ ప్రయోజనాలు సాధించే అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. కేంద్రంతో ఉన్న సన్నిహిత సంబంధాలతో వీటన్నింటినీ సాధించుకుని రావాలని ఎంపీలు కూడా భావిస్తున్నారు. మరి ఎంత వరకు సక్సెస్ అవుతారో. ఏపీకి నిధులు.. ప్రాజెక్టుల సంగతేమో కానీ.. అమరావతి భూములపై సీబీఐ విచారణకు ఉత్తర్వులు తీసుకొస్తే మాత్రం అంతకు మించిన విజయం మరొకటి ఉందని వైసీపీలో ప్రచారం జరుగుతోంది.