ఈమధ్య చిరంజీవి గుండుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈలుక్ ఏ సినిమా కోసం? అంటూ అంతా ఆసక్తిగా ఆరాలు తీశారు. ఇది ఓ వెబ్ సిరీస్ కోసమని కూడా ప్రచారం సాగింది. ఆచార్య షూటింగ్ దశలో ఉండగా.. చిరు ఇప్పుడెందుకు ఇంత అర్జెంటుగా గుండు గీయించుకున్నారు? అనే అనుమానాలూ వచ్చాయి. అయితే ఆ గుండు వెనుక ఉన్న రహస్యాన్ని చిరు చెప్పేశారు. నిజానికి అది గుండు కాదు. గుండులాంటి గుండు. మేకప్ మాయ. మేకప్ నిపుణులు చిరు లుక్‌ని అలా… మార్చేశారంతే. ఈ మొత్తం తతంగాన్ని చిరు ఓ వీడియో రూపంలో తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టేశారు. `ఇదే సినిమా మ్యాజిక్` అంటూ.. ఆ రహస్యాన్ని విప్పేశారు. మరోవైపు `ఆచార్య` కొత్త షెడ్యూల్ కోసం రంగం సిద్ధమవుతుందని టాక్. వచ్చే నెలలో `ఆచార్య` షూటింగ్ పునః ప్రారంభం కాబోతోంది. అయితే ముందుగా రామ్ చరణ్ షెడ్యూల్ ని పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ తరవాతే.. చిరు సెట్లో అడుగుపెడతారు.