తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించడానికి ఏమీ లేకుండా పోయింది. రోజు పరిమిత సమయంలోనే సభ నిర్వహిస్తున్నప్పటికీ.. ఆమోదించుకోవాల్సిన బిల్లులన్నీ ఆమోదం పొందాయి. దాంతో ఇక అసెంబ్లీని వాయిదా వేయడం మంచిదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసింది. మామూలుగా అయితే వర్షాకాల సమావేశాలు సుదీర్ఘంగా సాగుతాయి. అందుకని.. సీఎం కేసీఆర్ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిర్వహిస్తామని ముందుగానే ప్రకటించారు. మొదటి రోజు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఇరవై ఎనిమిదో తేదీ వరకూ నిర్వహించాలని నిర్ణయించారు.
అవసరం అయితే ఇంకా పొడిగిస్తామని… కీలకమైన అంశాలపై చర్చిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున లఘు చర్చకు 16 అంశాలను ప్రతిపాదించారు. కరోనా ఉధృతి, బీసీ సబ్‌ప్లాన్, ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 203 జీవో, శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో ప్రమాదం, నిరుద్యోగం, సంక్షేమం, వ్యవసాయం వంటి అంశాలపై చర్చించేందుకు అంగీకరించారు. అయితే ఈ అంశాలన్నింటిపై వారం రోజుల్లో చర్చ ముగిసిపోయింది. రెవిన్యూ చట్టం కూడా ఆమోదం పొందింది.
పీవీకి భారత తర్న ఇవ్వాలన్న తీర్మానం చేశారు. కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం కూడా చేశారు. బిల్లులన్నీ ఆమోదం పొందటంతో సమావేశాలు ముగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా కృష్ణాజలాలు, పోతిరెడ్డిపాడు, సంక్షేమంపై చర్చించాల్సి ఉందని… సమావేశాలు కొనసాగించాలని కాంగ్రెస్ నేతలు కోరినా.. పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. బుధవారం తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది.