ఓ వైపు వైసీపీ నేతలు ఆసరా వారోత్సవాలు అని సభలు సమావేశాలు పెట్టి.. పిల్లల్ని పెద్దల్ని పోగేసి డాన్సులు చేస్తున్నారు. పోలీసులకు అప్పుడు కోవిడ్ నిబంధనలు గుర్తు రావడం లేదు. కానీ ఇతరులు మాత్రం ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నారని తెలిస్తే పోలీసులు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. వెంటనే నోటీసులతో వారి వద్దకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతల విషయంలో అయితే జెట్ స్పీడ్‌గా పని చేస్తున్నారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని ఎడాది గడిచింది. ఈ సందర్భంగా…బుధవారం ప్రథమ వర్థంతి జరగనుంది. ఇందు కోసం నరసరావుపేటలోని తన ఇంటి వద్ద కోడెల కుమారుడు శివరాం ఏర్పాట్లు చేసుకున్నారు.
సత్తెనపల్లి,నర్సరావు పేట నియోజకవర్గాల్లో పలు చోట్ల కోడెల అభిమానులు కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కోవిడ్ నిబంధనలు గుర్తు చేస్తూ కోడెల శివరాంకు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని అందులో హెచ్చరించారు. నిర్వహించబోతోంది పార్టీ కార్యక్రమం కాదని..కేవలం తన తండ్రి మొదటి వర్ధంతి అని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే.. కార్యక్రమాలు ఆపబోమని కోడెల శివరాం ప్రకటించారు.
కోడెల మృతి తర్వాత ఆయన కుటుంబసభ్యులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కోడెలపై కేసులు పెట్టి..పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన ప్రభుత్వం.. చివరికి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోనీయడం లేదన్న ఆగ్రహం ..కోడెల అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అమలు చేస్తే నిబంధనలు అందరికీ ఒకలానే అమలు చేయాలని… కొంత మందికే అమలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.