కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానాన్ని ఏపీలో అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యను మాతృభాషలోనే చేయాలని .. విద్యా విధానాన్ని 5+3+3+4 విధానం పద్దతిలో అమలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తగిన విధంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం.. విద్యాశాఖ అధికారుల్లోనూ ఆశ్చర్యం రేకెత్తిస్తోంది.
ఆంధ్రలో తెలుగు మీడియంను రద్దు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఒక్క ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలని పట్టుబట్టింది. ఇది ప్రాధమిక హక్కును ఉల్లంఘించడమేనని కోర్టుల్లో కేసులు పడ్డాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అనేక మంది న్యాయపోరాటం చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్ రెండు మీడియంలలో చదువులు చెబితే.. విద్యార్థులు ఎందులో చేరాలనుకుంటే అందులో చేరుతారని సూచనలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రాధమిక విద్య మాతృభాషలో జరిగితే.. పిల్లల్లో మానసిక వికాసం ఉంటుందని నిపుణులు చెబుతున్నా.. పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లిపోరాడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం నూతన విద్యా విధానం తీసుకు వచ్చి… మాతృభాషలో బోధనను తప్పనిసరి చేసింది.
కేంద్రం జాతీయ విద్యా విధానం ప్రకటించిన తర్వాత ఏపీ సర్కార్ పెదవి విరిచింది. తాము ఇంగ్లిష్ మీడియం విషయంలో వెనక్కి తగ్గబోమని ప్రకటించారు. అవసరమైతే కోర్టుకెళ్తమన్నట్లుగా విద్యా మంత్రి సురేష్ ప్రకటించారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమీక్షలో.. జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడంతో ఇక ఇంగ్లిష్ మీడియం ఆలోచన విరమించుకున్నట్లేనని చెబుతున్నారు. మాతృభాషకు మంచి రోజులు వచ్చినట్లేనని అంచనా వేస్తున్నారు.