దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకున్నానని, తనకి పాజిటీవ్ అని తేలిందని చెప్పుకొచ్చారు. ”నేను ఇప్పుడేంటి.. గత అరవై, డభై ఏళ్లుగా పాజిటీవ్‌నే…` అంటూ.. కరోనాని సైతం లైట్ తీసుకున్నారు సింగీతం. డాక్టర్లు పాజిటీవ్ అని చెప్పిన దగ్గర్నుంచీ తాను హోం ఐసొలేషన్‌లో ఉన్నానని, ఈనెల 23 వరకూ తాను ఐసొలేషన్‌లోనే ఉంటానని చెప్పారు సింగీతం. అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు ఎవరూ కంగారు పడొద్దని, తన ఆరోగ్యం పూర్తిగా అదుపులోనే ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని చెప్పుకొచ్చారు. సింగీతం ప్రస్తుతం ఓ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పనులు అయిపోయాయి కూడా. ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించబోతోందని ప్రచారం జరుగుతోంది.