విజయవాడ కనకదుర్గమ్మకు సంబంధించిన వెండి రథానికి ఉన్న సింహాల ప్రతిమలు ఎప్పుడు మాయం అయ్యాయి..? ఎవరు మాయం చేశారన్నదానిపై దుమారం రేగుతోంది. వెండి రథానికి నాలుగు వైపులా నాలుగు సింహాల ప్రతిమలు ఉన్నాయి. నాలుగింటిలో మూడింటిని కత్తిరించి తరలించేశారు. మరో సింహపు ప్రతిమ కూడా తీసుకెళ్లడానికి కత్తిరించే ప్రయత్నం చేశారు. ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. విషయం బయటకు రావడంతో దుమారం రేగింది. అయితే.. ఇంద్రకీలాద్రి ఆలయ ఈవో మాత్రం..అసలు అక్కడ సింహపు ప్రతిమలు ఉన్నాయో లేవో రికార్డులు చూసి మూడు రోజుల తర్వాత చెబుతామని చెప్పుకొచ్చారు.
ఆయన నిర్లక్ష్యమైన సమాధానం రాజకీయ పార్టీల విమర్శలకు ఆయుధంగా మారింది. మరో వైపు ఉదయం నుంచి వివిధ రాజకీయ పార్టీల నేతలు.. రథాన్ని పరిశీలించడం ప్రారంభించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకూడా పరశీలించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. అయితే.. ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు మంత్రి వెల్లంపల్లి ప్రయత్నించారు. ఓ వైపు ఈవో అక్కడ విగ్రహాలు ఉన్నాయో లేవో రికార్డులు చూసి చెబుతామని ప్రకటించారు కానీ మంత్రి వెల్లంపల్లి మాత్రం అవి టీడీపీ హయాంలోనే మాయమైనట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. వెండి రథంలోని సింహాలు మాయంపై కమిటీ ఏర్పాటు చేశారు.
ఈవో, మంత్రి తీరు చూస్తూంటే… మూడు సింహాల దొంగలెవరో మంత్రికి, ఈవోకు తెలుసని టీడీపీ ఆరోపిస్తోంది. మొత్తానికి అంతర్వేది రథం వివాదం సద్దుమణగకముందే ఇంద్రకకీలాద్రి రథం విగ్రహాల మాయం తెరపైకి వచ్చింది. ఈ వివాదం ఇంతటితో అగే అవకాశం కనిపించడం లేదు. అయితే.. అత్యంత విలువైన, పవిత్రమైన రథానికి ఉన్న విగ్రహాలు మాయం అయ్యాయని.. తెలిసిన తర్వాత కూడా.. ప్రభుత్వం ఆలయవర్గాలు స్పందించిన తీరు మాత్రం విమర్శలకు కారణం అవుతోంది.