తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కరోనా అడ్డం పడింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు పలువురు సిబ్బందికి సమావేశాల సమయంలోనే కరోనా సోకడంతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముందు జాగ్రత్తగా అన్ని పార్టీలో చర్చించి సభను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. వారం రోజుల పాటు సాగిన తెలంగాణ అసెంబ్లీలో పన్నెండు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపారు. మామూలుగా అయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకూ అసెంబ్లీని నిర్వహించాలనుకున్నారు. ఆమోదింప చేసుకున్న కీలకమైన బిల్లుల్లో రెవిన్యూ బిల్లు కూడా ఉంది. కరోనా టైంలో అసెంబ్లీ సమావేశాలను అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంది. అయితే ఆచరణలో మాత్రం… పెద్దగా ఆ జాగ్రత్తలు కనిపించలేదు.
పార్లమెంట్ సమావేశాలకు ప్రోటోకాల్ పాటించినట్లుగా ఎమ్మెల్యేలు, కుటుంబసభ్యులు..వారి సిబ్బంది అందరికీ టెస్టులు నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ ఆ టెస్టులు పూర్తి స్థాయిలో చేయలేదు. ఫలితంగా కోవిడ్ కేసులు తరచూ బయటపడుతున్నాయి. మూడో రోజే.. అసెంబ్లీలో పాసులిచ్చే ఉద్యోగికి కరోనా వచ్చింది. ఆయన పదుల సంఖ్యలో వ్యక్తులకు పాసులు స్వయంగా ఇచ్చారు. అప్పుడే కలకలం ప్రారంభమయింది. ఆ తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలకు..పోలీసులకు పాజిటివ్ వచ్చింది. ఈ పరిణామాలన్నింటితో… స్పీకర్ అన్ని పార్టీల నేతలతో చర్చించారు.
చివరికి సభను నిరవధిక వాయిదా వేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం …కూడా ఇలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందేమో అన్న ఉద్దేశంతో కీలకమైన బిల్లులన్నింటినీ ముందుగానే ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. పీవీకి భారరత్న తీర్మనం… కొత్త విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం వంటివి చేసేశారు., ఇక ప్రత్యేకంగా ఏ చట్టం..తీర్మానం చేయాల్సిన అవసరం లేకపోవడంతో… సమావేశాల కొనసాగింపులకు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఆసక్తి చూపలేదు. దాంతో… వారం రోజులకే సమావేశాలు ముగిసినట్లయింది.