కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం తీరు రోజు రోజుకు వివాదాస్పదమవుతోంది. ఆయన తోబుట్టువులు స్వగ్రామంలో అంతర్రాష్ట్ర పేకాట క్లబ్ నిర్వహిస్తూ.. అడ్డంగా దొరికిపోయారు. అయినా తనకేమీ సంబంధం లేదని చెప్పుకున్న ఆయన తాజాగా…. మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి అయిన తర్వాత ఆయన విశృంఖలంగా భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పరి మండలంలో ఇటీవలి కాలంలో మంత్రి కుటుంబసభ్యుల పేరిట పెద్ద ఎత్తున భూములు రిజిస్టర్ అయ్యాయి. కొంత మంది అనుచరుల పేరుతోనూ ఆ భూములు రిజిస్టర్ అయ్యాయి. ఈ విషయం బయటకు రావడంతో దుమారం రేగుతోంది.
కుటుంబసభ్యులు, అనుచరుల పేరుతో భూములు రిజిస్టర్ అయిన విషయం వెలుగులోకి రావడంతో గుమ్మనూరు జయరాం ఎదురుదాడికి దిగుతున్నారు. తాను.. తన కుటుంబసభ్యులు ఆస్పరి మండలంలో వంద ఎకరాలు కొనుగోలు చేసిన మాట నిజమేనని ప్రకటించారు. అయితే.. అయితే రైట్ రాయల్‌గా కొనుగోలు చేశామని… అందులో కబ్జాలు… దౌర్జాన్యాలు అనే మాటే లేదని అంటున్నారు. నేనెప్పుడూ తప్పు చేయను.. తప్పు చేయనంతవరకు భయపడను అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తప్పుచేస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా చాలెంజ్ చేస్తున్నారు. మంత్రి ఇంతగా కంగారు పడుతూంటే.. చాలా మందికి అనుమానాలొస్తున్నాయి.
నిజానికి వంద ఎకరాల కొనేంత ఆదాయం మంత్రికి కానీ ఆయన కుటుంబసభ్యులకు కానీ లేదు. గత ఎన్నికల అఫిడవిట్లో తన ఏడాది ఆదాయం రూ. లక్షా నలభై వేల రూపాయలు అని చెప్పారు. తన భార్యకు అసలు ఆదాయమే లేదన్నారు. ఇక ఏ ఇతర వ్యాపారాలు ఉన్నాయని కూడా చెప్పలేదు. కానీ మంత్రి అవ్వగానే మంత్రి .. ఆయన కుటుంబసభ్యులు వందల ఎకరాలు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ వ్యవహారాలన్నీ బయటకు రావడంతోకబ్జాలు కాదని కొనుగోలు చేశానని చెబుతున్నారు. కొనుగోలు చేయడానికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిదో కూడా ఆయన చెప్పాల్సి ఉంది. మంత్రి జయరాం తీరు వైసీపీలోనే చర్చనీయాంశం అవుతోంది.