బీజేపీ అగ్రనేతలు ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి, వినయ్ కతియార్‌లకు జడ్జిమెంట్ డే వచ్చేస్తోంది. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో అభియోగాలు నమోదైనందున సీబీఐ కోర్టు ఇచ్చే అంతిమ తీర్పు వారికి అత్యంత కీలకం కానుంది. 27 సంవత్సరాల సుదీర్ఘ విచారణకు తెరపడనుంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై సెప్టెంబరు 30న తీర్పు రానుంది. కుట్రదారులుగా ఛార్జీషీటు దాఖలైన అద్వానీ, మురళీమనోహర్ జోషీ, ఉమా భారతీ, వినయ్ కతియార్ ఆ రోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
అయోధ్య రామాలయం నిర్మాణం తమ ఘనతగా చెప్పుకుంటున్న బీజేపీ.. బాబ్రీ కూల్చివేత విషయంలో మాత్రం తమ నేతలను వెనకేసుకు రాలేని పరిస్ధితి. చట్ట ప్రకారం వీరు విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చే తీర్పు కీలకం కాబోతోంది. ఈ కేసునే కారణంగా చూపి అద్వానీకి రాష్ట్రపతి పదవి దక్కనీయలేదనే ప్రచారం కూడా ఉంది. అయోధ్యలో రామాలయం నిర్మించాలన్న తమ ఆకాంక్ష నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని నేతలు చెబుతున్న సమయంలో…. కోర్టు తీర్పు వారిని వ్యక్తిగతంగా కలవరపెడుతోంది.
1992లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును కరసేవకులను ప్రోత్సహించి బీజేపీ అగ్రనేతలు కూల్చివేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. జస్టిస్ లిబర్హాన్ కమిషన్ విచారణ, అనంతరం సీబీఐ విచారణ తర్వాత ఈ అభియోగాలపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది32 మంది నిందితుల్లో ఎల్కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి, రాజస్థాన్ మాజీ గవర్నర్ కల్యాణ్ సింగ్ ఉన్నారు. దేశంలో అస్థిరత సృష్టించిన బాబ్రీ మసీదు ఘటన..విచారణ ప్రారంభమైన 27ఏళ్లు గడిచినా తీర్పు వెలువరించకపోవడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా విచారణను త్వరగా ముగించాలని పలుమార్లు సీబీఐ ప్రత్యే్క కోర్టుకు సూచించింది. ఈ మేరకు తీర్పు వెలువడనుంది.