విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ను ప్రారంభించి ఘనంగా ప్రచారం చేసుకుందామనుకున్న వారికి కరోనా వరుస పెట్టి షాక్ ఇస్తోంది. ప్రారంభోత్సవానికి పదే పదే అడ్డం పడుతూండటంతో..చివరికి ముహుర్తం ప్రకారం..వాహనాల రాకపోకలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. మామూలుగా అయితే.. పద్దెనిమిదో తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ… ఆన్ లైన్ ద్వారా ఫ్లైఓవర్ ను ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆన్ లైన్ సభకు సీఎం జగన్ అధ్యక్షత వహించాలని కేంద్రమంత్రి కార్యాలయం నుంచి సమాచారం కూడా వచ్చింది.
కానీ గడ్కరీకి కరోనా నిర్ధారణ కావడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. గతంలో కూడా రెండు సార్లు ప్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముహుర్తాన్ని ఖరారు చేశారు. వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వస్తున్నారు. అసలు మామూలుగా ఈఫ్లైఓవర్ను సీఎం జగన్ ప్రారంభించేయాలని అనుకున్నారు. కానీ ఇది కేంద్ర నిధులతో నిర్మించినది కావడంతో ఎంపీ కేశినేనినాని వెళ్లి.. నితిన్ గడ్కరీని ఆహ్వానించారు. ఈ మేరకు గడ్కరీ కార్యాలయం ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ తేదీలను తామే ఖరారు చేస్తోంది.
రెండు సార్లు వాయిదా పడటంతో.. ఇక ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్న ఉద్దేశంతో.. ముందుగానే నిర్ణయించిన దాని ప్రకారం..వాహనాల రాకపోకలకు అనుమించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఎంపీ కేశినేని నాని ట్వీట్ ద్వారా తెలిపారు. తర్వాత ఎప్పుడైనా గడ్కరీ కోలుకున్న తర్వాత..లాంఛనంగా.. ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది.