హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టామని టీఆర్ఎస్ నేతలు గొప్పగా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం రెండు, మూడు వేల ఇళ్లు కూడా కట్టకుండా.. అబద్దాలు చెబుతున్నారని విమర్శలు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ .. ఇళ్లు చూపిస్తానని.. కాంగ్రెస్ నేతలకు సవాల్ చేశారు. అలా అనడమే కాదు.. హైదరాబాద్ మేయర్‌ను తీసుకుని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లిపోయారు. భట్టి కూడా.. లక్ష బెడ్రూం ఇళ్లను చూద్దామని బయలుదేరారు. అయితే..రోజంతా వారు చూసినా.. 3వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మాత్రమే చూడలిగారు.
మరికొన్ని చోట్ల కూడా కట్టామని..వాటిని రేపు చూపిస్తామని.. మంత్రి తలసాని చెప్పుకొచ్చారు. 2 లక్షల ఇళ్లలో లక్ష ఇళ్లు పూర్తయ్యాయి అని మంత్రి చెప్పారని . తీరా చూస్తే.. 3,428 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే సిద్ధమయ్యాయని భట్టి తలసాని ముందే మీడియాకుచెప్పారు. చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని కవర్ చేసుకున్నారు. ఇంకా చూడాల్సినవి ఉన్నాయన్నారు. ఎంత చేసినా లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు అంటే మామూలు విషయం కాదు. తెలంగాణ సర్కార్ అంత భారీ ఎత్తున నిర్మాణం చేయడం లేదు. కొన్ని చోట్ల… ఇళ్ల నిర్మాణం చేస్తున్నప్పటికీ.. అది సంఖ్యాపరంగా లక్షవరకు రాదు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డబుల్ బెడ్రూం ఇళ్లే హాట్ టాపిక్.
తలసాని తన నియోజకవర్గంలో ఓ చోట… ఓ పదో..ఇరవయ్యే డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టించి..వాటిని చూపించి..ఎన్నికల్లో భారీవిజయాన్ని నమోదయ్యేలా చేశారు. ఈ సారి కూడా అదే ప్లాన్ లో ఉన్నట్లుగా ఉన్నారు. అయితే ఐదేళ్లు గడిచినా లబ్దిదారులకు ఇంత వరకూ ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదు. ఇప్పుడు కట్టిన ఇళ్లను చూపించి…మీకే ఇస్తామని ఆశపెట్టి..ఓట్లు దండుకుంటారని.. చివరికి కట్టిన ఆ అరకొర ఇళ్లను ఎవరికిస్తారో అంచనా వేయలేమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తానికి డబుల్ బెడ్ రూం ఇళ్ల రాజకీయం గ్రేటర్ ఎన్నికల వేడిని అన్ని పార్టీల్లోనూ తీసుకొచ్చేసింది.