నేర చరితులైన నేతల్ని రాజకీయాల నుంచి ఏరి వేసే లక్ష్యంతో సుప్రీంకోర్టు చురుకుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే అమికస్ క్యూరీ ద్వారా అన్ని హైకోర్టుల నుంచి సమాచారాన్ని తెప్పించుకున్న సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. నేరచరిత గల నేతల కేసుల పరిష్కారానికి వారం రోజుల్లో.. యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని హైకోర్టులకు సూచించింది. యాక్షన్ ప్లాన్లో 9 అంశాలను చేర్చాలని ఆదేశించింది. త్వరితగతిన కేసుల పరిష్కారమయ్యేలా యాక్షన్ ప్లాన్ ఉండాలని.. ప్రతి జిల్లాలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో.. ఎన్ని స్పెషల్ కోర్టులు అవసరమో చెప్పాలని ఆదేశించింది. స్టే ఉన్న కేసులను కూడా 2 నెలల్లో కొలిక్కి తీసుకురావాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతి జిల్లాలోని పెండింగ్ కేసులు, ప్రత్యేక కోర్టుల సంఖ్య, అందుబాటులో ఉన్న కోర్టులు, జడ్జిల సంఖ్య, పదవీ కాలం, ప్రతి న్యాయమూర్తి ఎన్ని కేసులు పరిష్కరించగలరు…పరిష్కారానికి పట్టే సమయాన్ని యాక్షన్ ప్లాన్లో పొందు పరచాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఇప్పటికే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాడానికి కేంద్రం సముఖత తెలిపింది. ప్రత్యేక కోర్టులు ఏర్పాుట చేస్తామని..మౌలిక సదుపాయాల కల్పనకు రెండు నెలల సమయం చాలని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. దాంతో సుప్రీంకోర్టు…అవినీతి నేతలపై కేసుల విచారణకు… తదుపరి చర్యలు ప్రారంభించింది. హైకోర్టుల ద్వారా ప్రత్యేక కోర్టుల అవసరాలను తెలుసుకుని.. ఆ తర్వాత ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు.. మాజీ ప్రజా ప్రతినిధులపై దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు ఉన్నాయి. వాటన్నింటినీ సుప్రీంకోర్టు తేల్చేసే అవకాశం కనిపిస్తోంది.
నేర చరితుల్ని రాజకీయాల నుంచి దూరం చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. గతంలో రెండేళ్ల శిక్ష పడిన వారు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తీసుకువచ్చారు. అయితే భారతీయన్యాయవ్యవస్థలో కేసుల విచారణలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. చట్టాల్లో లొసుగులను ఆధారంగా చేసుకుని నేతలు.. కేసులు విచారణకు రాకుండా చేసుకుంటున్నారు. ఈ కేసులు ఎప్పటికీ తేలకపోతూండటంతో…సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఆ నేరచరితల అంశాన్ని తేల్చాలని డిసైడయింది.