ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై మరోసారి పన్నులు వడ్డించింది. పెట్రోల్, డీజిల్‌పై మరో రూపాయి సెస్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీలో రోడ్ల పరిస్తితి దిగజారిపోయింది. సరైన నిర్వహణ లేకపోవడంతో.. విమర్శలు ఎదురవుతున్నాయి. కేబినెట్ సమావేశాల్లో మంత్రులు కూడా అదే విషయం చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి రెండు కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ రెండు కోట్లను ఎలా వసూలు చేయాలో ఇప్పుడు నిర్ణయించుకున్నారు. వాహనదారుల నుంచే ఆ సొమ్ము పన్నుల రూపంలో వడ్డించాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటి వరకూ విధిస్తున్న పన్నులకు అదనంగా లీటర్ పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై రూ.1 సెస్ విధించారు. రహదారి అభివృద్ధి నిధి కోసం సెస్ వసూలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ సెస్ విధింపు ద్వారా వాహన దారుల నుంచి రూ.600 కోట్లు పిండుకోవచ్చని ప్రభుత్వ అంచనా. గతంలో చంద్రబాబు తగ్గించిన వ్యాట్‌ను… అదనపు పన్నును కూడా.. జగన్ సర్కార్ వచ్చాక పెంచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి పెట్రోలు, డీజిల్‌పై రూ.2 చొప్పున అదనపు వ్యాట్ ఉంది. జూలైలో పెట్రోలుపై రూ.1.24, డీజిల్‌పై 93 పైసల చొప్పున అదనపు వ్యాట్ పెంచింది.
అంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.2గా ఉన్న అదనపువ్యాట్ రెట్టింపైంది. దానికి అదనంగా ఇప్పుడు రెండింటిపైనా ఇంకో రూపాయి పెంచనుంది. జూలైలో పెంచిన అదనపు వ్యాట్ వల్ల రూ.600 కోట్లు, తాజా సెస్‌తో మరో రూ.600 కోట్లు సమకూరనున్నాయి. కొద్ది రోజుల క్రితం.. సహజవాయువు ధరలు పెంచడంలో వనాల్లో వాడే గ్యాస్ ధర పెరిగింది. నెలలో ఒకటి రెండు సార్లు..ఏదో విధమైన పన్నులను పెంచుతున్నట్లుగా ప్రభుత్వం నుంచి ప్రకటనలు వస్తున్నాయి. గతంలో ఐదేళ్లలో పన్నుల పెంపులు లేకపోయినా బాదుడే బాదుడు అంటూ విమర్శలు గుప్పించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా చేయడం ఏమిటన్న చర్చ సామాన్యుల్లో పెరిగిపోతోంది.