అఖిల్‌లోని నటుడు కంటే క్రికెటరే ముందుగా పరిచయం అయ్యాడు. సీసీసీ (సెలబ్రెటీ క్రికెట్ లీగ్) తో అఖిల్ బ్యాటింగ్ విన్యాసాలు చూసే అవకాశం దక్కింది. హీరో కాకపోయి ఉంటే కచ్చితంగా క్రికెటర్ అయిపోతాడు అన్నంత సీరియస్ నెస్ అఖిల్ ఆటలో కనిపించేది. కానీ.. అఖిల్ మాత్రం అలా ఎప్పుడూ అనుకోలేదంటున్నాడు. “క్రికెట్ నా హాబీ మాత్రమే. ఎప్పుడూ క్రికెటర్ కావాలనుకోలేదు. దానికి చాలా ప్యాషన్ ఉండాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాలంటే జీవితం ధారబోయాలి. నాకు క్రికెట్ అంటే ఇష్టం మాత్రమే. స్కూలు వయసులో.. క్రికెట్ తెగ ఆడేవాడ్ని. కోచింగ్ తీసుకోవడానికి ఆస్ట్రేలియా కూడా వెళ్లా. ఇప్పటికీ క్రికెట్ ఆడుతూనే ఉంటా. మానసికంగా ఒత్తిడి ఉన్నప్పుడు క్రికెట్ ఆడితే.. అదంతా మాయం అవుతుంది. క్రికెట్ ని నేనెప్పుడూ అలానేచూశాను” అంటున్నాడు.
శనివారం నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ గురించి అఖిల్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడట. “ఐపీఎల్ అనేది అతి పెద్ద క్రికెట్ పండగ. మన ఫేవరెట్ ప్లేయర్స్ అందరినీ ఒకేచోట చూసే వీలు దక్కుతుంది. ఐపీఎల్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ కాను. నాకు విరాట్, డివిలియర్స్ అంటే చాలా ఇష్టం. వాళ్లిద్దరూ ఒకే టీమ్ లో ఉంటారు. అందుకే బెంగళూరు మ్యాచ్ ఆడుతుంటే.. మరింత ఆసక్తి మొదలైపోతుంది. టీమ్ గా చెప్పాల్సివస్తే.. మన హైదరాబాద్ జట్టుని సపోర్ట్ చేస్తా” అంటున్నాడు. మామూలుగా అయితే.. ఐపీఎల్ మ్యాచులు అనగానే వెంకీ, అఖిల్‌లు స్టేడియాల్లో దర్శనం ఇస్తుంటారు. ఈసారి వాళ్లకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈసారి ఐపీఎల్ దుబాయ్ లో జరగబోతోంది. అందులోనూ ప్రేక్షకులు లేకుండానే.