కేంద్రం తీసుకు వచ్చిన వివాదాస్పద వ్యవసాయ బిల్లును వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఈ మేరకు ఎంపీలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
కేంద్ర వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి లాంటిదని కేసీఆర్ చెబుతున్నారు. వ్యవసాయ బిల్లుతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. రైతులను దెబ్బతీసేలా… కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేలా బిల్లు ఉందని కేసీఆర్ చెబుతున్నారు. బిల్లును వ్యతిరేకించాలని టీఆర్ఎస్ ఎంపీలను ఆదేసించారు. వ్యవసాయ బిల్లు అమలులోకి వస్తే రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుందని.. కేసీఆర్ భావిస్తున్నారు. రవాణా ఖర్చులు భరించి రైతులు వేరే చోట అమ్ముకోవడం సాధ్యం కాదని.. మొక్కజొన్న దిగుమతి సుంకాన్ని ఎవరికోసం తగ్గించారని కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు అవసరాల మేరకు వ్యాపారులు మొక్కజొన్నను దిగుమతి చేసుకుంటే..పండించిన రైతులు ఏమైపోవాలని కేసీఆర్ కేంద్రాన్ని అడుగుతున్నారు. ఆర్థిక సంక్షోభం సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై కేసీఆర్ ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం వ్యవసాయ బిల్లులు రాజకీయ అంశంగా మారాయి. కేంద్రమంత్రివర్గం నుంచి అకాలీదళ్ వైదొలిగింది. ఎకైక మంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా చేసి.. కేంద్రంపై పోరుబాట పట్టారు. పంజాబ్,హర్యానాల్లో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు మెల్లగా ఇతర ప్రాంతాలకు పాకుతున్నాయి. వ్యవసాయ బిల్లులపై మొదట పెద్దగా చర్చ జరగకపోవడంతో..దేశంలోని ఇతర ప్రాంతాల వారికి దీనిపై అవగాహన రాలేదు. ఇప్పుడు రైతాంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రకియగా అనుమానిస్తూ ఉండటంతో రైతుల్లో ఆందోళన ప్రారంభమయింది. రైతుల ఆగ్రహాన్ని చూసి..ఇప్పటి వరకూమద్దతిచ్చిన పార్టీలు కూడా వెనుకడుగు వేస్తున్నాయి. ఇప్పటి వరకూ పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా.. ఇప్పుడు… తేనే పూసిన కత్తి లాంటి పదాలతో విరుచుకుపడుతున్నారు.
ప్రస్తుతం వ్యవసాయ బిల్లులు లోక్సభలో పాసయ్యాయి. రాజ్యసభలో పాస్ కావాల్సి ఉంది. అత్యధిక పార్టీలు వ్యతిరేకిస్తూ ఉండటంతో రాజ్యసభ గండం బయటపడటం అంత తేలిక కాదన్న చర్చ జరుగుతోంది. మొత్తం 245 సభ్యుల గల పెద్దల సభలో ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 86 సభ్యుల మద్దతు ఉంది. విపక్ష కాంగ్రెస్కు 40 మంది సభ్యులు ఉన్నారు. జేడీయూతో పాటు అన్నాడీఎంకే, బీజూ జనతాదళ్, వైసీపీ రైతుల గురించి పట్టించుకోకుండా బీజేపీకి మద్దతిచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా వ్యవసాయబిల్లులపై బీజేపీలో టెన్షన్ ప్రారంభమయింది.