తిరుమల పవిత్రను మంట గలిపేలా.. దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయాన్ని కాలరాస్తూ.. శ్రీవారిపై నమ్మకం లేని అన్యమతస్తులు కూడా..నేరుగా ఆలయంలోకి ప్రవేశించవచ్చని.. పట్టు వస్త్రాలు సమర్పించవచ్చన్నట్లుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయంపై హిందువుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓ వైపు బయట దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతూంటే..తిరుమలో శ్రీవారి సంప్రదాయాలపై దాడి జరుగుతోందనే భావన వ్యక్తమవుతోంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు. ఓ వ్యక్తి కోసం తిరుమల పవిత్రతను మంటగలిపి..హిందువుల మనోభావాలను దెబ్బతీస్తు్ననారని…ఇలాంటి చర్యల్ని కేంద్రం అడ్డుకోవాలి కోరారు. మాజీ టీటీడీ ఐవైఆర్ కృష్ణరావు కూడా వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను ట్విట్టర్లో ఖండించారు. ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న నిబంధనను మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రే సమర్పించాలన్న నిబంధన ఎక్కడాలేదని.. హిందూత్వంపై ముఖ్యమంత్రికి విశ్వాసం లేకపోతే దేవాదాయ మంత్రి పట్టువస్త్రాలు సమర్పించవచ్చునని ఐవైఆర్ సలహా ఇచ్చారు. డిక్లరేషన్ ప్రక్రియ లేదంటూ కొత్త వాదన తెచ్చి.. వైవీ సుబ్బారెడ్డి హిందూ మతంపై దాడి చేస్తున్నారని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఏవీ రమణ మండిపడ్డారు. 16 నెలల్లో భక్తుల మనోభావాలు దెబ్బతీసి టీటీడీని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర హిందూత్వవాదులు ఈ అంశాన్ని చాలా సీరియస్ మ్యాటర్‌గా భావిస్తున్నారు. కానీ ఆలాయల పవిత్రతను కాపాడటానికి తామే బ్రాండ్ అంబాసిడర్లమన్నట్లుగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతల నోరు మాత్రం పెగల్లేదు.
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఇంత కాలం రాజకీయాలు చేస్తున్నారు కానీ… ఇంద్రకీలాద్రి రథం నుంచి చోరీచేసిన విగ్రహాల గురించి..అత్యంత పవిత్రమైన తిరుమలలో సంప్రదాయలను మార్చేస్తున్న వైనం గురించి వారు మాట్లాడటంలేదు. రాజకీయం కోసం అయితే ఎన్నైనా చేస్తారు కానీ.. తిరుమల పవిత్రత కోసం బీజేపీ నేతలు … ఎందుకు మాట్లాడరన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది.