కేంద్ర ప్రభుత్వం 12వేల కిందట నుంచి ఇప్పటి వరకూ ఉన్న భారతీయ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అధ్యయనం చేయడానికి ఓ కమిటీని నియమించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ పార్లమెంట్‌కు ఈ విషయాన్ని తెలిపారు. ఇతర రాజకీయ అంశాల కారణంగా ఈ విషయం పెద్దగా ప్రాముఖ్యత పొందలేదు…కానీ ఆ కమిటీని పరిశీలించిన తర్వాత మాత్రం.. దక్షిణాది అసలు ఇండియాలో లేదా అని అనుకునే పరిస్థితి. 12వేల ఏళ్ల కిందటి నుంచి చరిత్రను.. సంస్కృతిని అధ్యయనం చేయడానికి పదహారు మంది సభ్యులను ఏర్పాటు చేస్తే… అందులో ఒక్కరంటే ఒక్కరు… దక్షిణాది వారు… తెలుగువారు అసలే లేరు. పాండేలు, దీక్షిత్‌లు, శుక్లాలు, బిష్త్‌లు ఉన్నారు. కానీ ఒక్కరంటే.. ఒక్క దక్షిణాది రీసెర్చర్ లేరు. అందరూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే.
భారతదేశ సంస్కృతిలో దక్షిణాదికి ప్రత్యేకత ఉంటుంది. ఆ విషయం ఎవరూ తోసిపుచ్చలేరు. భారతీయంలో మమేకమైన దక్షిణాది సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడి పరిశోధకులు మాత్రమే అధ్యయనం చేయగలరు. కానీ కేంద్రం నియమించిన కమిటీలో అందరూ ఉత్తరాది ప్రముఖులే ఉన్నారు. వారు కూడా ఉత్తరాదికి చెందిన ఆర్కియాలజీ వ్యవహారాల్లోనో.. సంస్కృతుల విషయంలోనో పరిశోధనలు చేసిన వారు. ఎవరూ కూడా దక్షిణాది సంస్కృతిపై అవగాహన ఉన్నవారు లేరు. దీంతో.. కేంద్రం తీరుపై దక్షిణాది నుంచి నిరసనలు వినిపించడం ప్రారంభించాయి.
దక్షిణాది సంస్కృతి లేకుండా భారతీయత ఎక్కడి నుంచి వచ్చిందని కర్ణాటక నేతలు ప్రశ్నించడం ప్రారంభించారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో లబ్దప్రతిష్టులైన సంస్కృతి పరిశోధకులు ఉన్నారు. కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక సహా.. అనేక రాష్ట్రాల్లో ఎంతో ఉన్నతమైన సంస్కృతి.. సంప్రదాయాలున్నాయి. కానీ.. వాటిని గుర్తించడానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇష్టపడుతున్నట్లుగా లేదు. పన్నెండు వేల కిందటి సంస్కృతిని పరిశోధకుల ద్వారా గుర్తించి.. దానికో గుర్తింపు తెస్తారు. దాని ద్వారా.. ఇక ఉత్తరాది సంస్కృతే.. భారత సంస్కృతి అవుతుంది… దక్షిణాదిది మాత్రం పరాయిది అవుతుదంని.. కొంత మంది పరిశోధకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ భాష, సంస్కృతిల ఉనికిని కాపాడుకునేందుకు రాజకీయాలుకు అతీతంగా పని చేసే పొరుగు రాష్ట్రాల నేతలు ఈ అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. అయితే.. తెలుగు భాషనే వద్దనుకుంటున్నారు కాబట్టి.. ఏపీలో ఎలాంటి పట్టింపులు కనిపించడం లేదు. చరిత్రలో భారత సంస్కృతిలో తెలుగువారికి .. తెలుగు సంప్రదాయాలకు.. సంస్కృతికి చోటు లభించకపోయినా ఎవరికీ పెద్దగా ఇబ్బంది లేదు. మిగతా రాష్ట్రాల వారు గొంతెత్తడానికి ప్రయత్నిస్తున్నారు.. కానీ ఏపీ నుంచి అదసలు విషయమే కాదని అనుకుంటున్నారు.. కాబట్టి కేంద్రం కూడా లైట్ తీసుకుంటుంది.