ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొణెని కథానాయికగా ఎంచుకున్నారు. ఈ స్క్రిప్టు పనుల్లో దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా ఓ చేయి వేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇది వరకు వైజయంతీ మూవీస్ నుంచి వచ్చిన `మహానటి`లోనూ.. సింగీతం సహాయం అందించారు. సావిత్రి గురించి నాగ అశ్విన్‌కు కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు. అంతేకాదు.. `మహానటి`లో సింగీతం పాత్ర కూడా ఉంది. ఆ పాత్రలో తరుణ్ భాస్కర్ నటించారు.
ప్రభాస్ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ఇలాంటి కథలు ఊహించడంలో సింగీతం కొట్టిన పిండి. `ఆదిత్య 369` లాంటి సినిమాలు తీశారాయన. ఆ తరహా ఫాంటసీ కథలు ఆయన దగ్గర చాలా ఉన్నాయని వినికిడి. అందుకే ఈ తరహా కథకి ఆయన సలహాలూ, సూచనలూ ఉపయోగపడతాయని చిత్రబృందం భావించింది. అందుకే ఈ టీమ్ లో ఆయనా ఓ సభ్యుడైపోయారు.