ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని ఓడిపోయిన పార్టీలన్నీ డిమాండ్లు చేస్తూ ఉంటాయి. దాని కోసం కోర్టులకు ఎక్కాయి. ఎక్కడా సానుకూల ఫలితం రాలేదు. కానీ.. ఇప్పుడు కరోనా వారికి ఎలాంటి న్యాయపోరాటం అవసరం లేకుండానే.. బ్యాలెట్ అవకాశం తెచ్చి పెట్టబోతోంది. ఈవీఎంల్లో ఓటు వేయాలంటే పంచ్ చేయాలి. అలా ఒక్కో బూత్‌లో .. ఒక్క ఈవీఎంపై కనీసం వెయ్యి మంది ఒకే చోట టచ్ చేస్తారు. అది వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం అవుతుంది. ఒక్క ఓటర్‌కు లక్షణాలు లేని కరోనా వైరస్ ఉన్నా.. ఇతరులకు వ్యాపించడం సులభం. అందుకే.. ఇప్పుడు.. బ్యాలెట్‌పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముందుగా.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బ్యాలెట్ వాడే అవకాశం కనిపిస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలకు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ లేఖ రాశారు. కోవిడ్ కారణంగా బ్యాలెట్ పేపర్, ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబధించి పార్టీల అభిప్రాయం తెలపాలని సూచించారు. ఈనెల 30 లోపు అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని లేఖలో ఎస్ఈసీ కోరింది. నిజానికి ఈవీఎంలు వద్దని.. విపక్షాలు కోరుకుంటున్నాయి. కాబట్టి.. కరోనా కారణంగా వచ్చిన అవకాశాన్ని వదిలి పెట్టే అవకాశం లేదు. బ్యాలెట్లే కోరుకుంటాయి. ఇక అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కూడా ఈవీఎంలు కోరుకోవడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను.. బ్యాలెట్‌తోనే నిర్వహించారు. తెలంగాణ అధికార, ప్రతిపక్షాలు ఈవీఎంలు వద్దనుకుంటున్నాయి కాబట్టి.. బ్యాలెట్‌తోనే ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది.
ఈవీఎంలతో ఎన్నికలు జరగడం వల్ల.. ఓడిపోయిన వారు.. ఎన్నికల విశ్వసనీయతనే ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్యాలెట్లు వాడుతున్నారు.. టెక్నాలజీపై కనీస అవగాహన ఉండని ప్రజలు ఎక్కువగా ఉన్న దేశంలో మనకు ఎందుకనే వాదన తీసుకొస్తున్నారు. అయితే.. బ్యాలెట్ విషయంలో అధికార పార్టీగా ఉన్నప్పుడు ఒకలా… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా పార్టీలు విధానాలను మార్చుకుంటూడటంతో… వారి వాదనలకు మద్దతు లభించడం లేదు.