ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా.. చీరాలలో మాస్క్ లేదని.. కిరణ్ కుమార్ అనే దళిత యువకుడ్ని కొట్టి చంపిన పోలీసుల వ్యవహారంలోనూ ప్రభుత్వం తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వకూడదని హైకోర్టు ప్రశ్నించినప్పుడు… చనిపోయిన కిరణ్ కుమార్ తల్లిదండ్రులు… విచారణ పట్ల కిరణ్ తల్లిదండ్రులు సంతృప్తి చెందారని .. అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. అప్పుడు మీ ప్రభుత్వంలో ఎవరినైనా సంతృప్తిపరచగలరని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమయంలో కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేసినప్పుడు.. అదుపులోకి తీసుకున్న మరో వ్యక్తి ఫోన్ కాల్ రికార్డును ఇస్తామని.. సీబీఐ కి ఇవ్వాలన్న పిటిషన్పై వాదనలు వినిపించిన న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ధర్మాసనం అక్కర్లేదని వ్యాఖ్యానించింది.
జూలైలో చీరాలలో కిరణ్ అనే యువకుడితో పాటు అతని స్నేహితుల్ని పోలీసులు మాస్క్ పెట్టుకోలేదన్న కారణంగా అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికే అతని పరిస్థితి విషమంగా మారడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ కిరణ్ చనిపోయారు. కిరణ్ తలకు గాయాలు ఉండటంతో కొట్టడంతోనే చనిపోయారని కిరణ్ బంధువులు ఆరోపించారు. అయితే.. కారులో నుంచి దూకేశాడని పోలీసులు వాదించడం ప్రారంభించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. సీబీఐ విచారణ చేయించాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే ఎస్ఐపై కేసు పెట్టించిన ప్రభుత్వం బాధితుల్ని సైలెంట్ చేసే ప్రయత్నం చేసిందనే విమర్శలు ఎదుర్కొంది.
అయితే ఈ అంశంపై మాజీ ఎంపీ హర్షకుమార్ కిరణ్కుమార్ తరపున హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణలో హైకోర్టు ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించే అర్హత ఉందని స్పష్టం చేసింది. అయితే పూర్తి వివరాలు ఇచ్చేందుకు 2 వారాల సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు.దీనికి అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. ప్రభుత్వం సంతృప్తికంగా వివరణ ఇవ్వకపోతే.. పోలీసులపై మరోసారి సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించినా ఆశ్చర్యం లేదని న్యాయవాదవర్గాలు అంచనా వేస్తున్నాయి.