ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహంతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా జగన్మోహన్ రెడ్డి వెంట అసాంతం ఉండేది విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు మాత్రమే. కానీ ఈ సారి జగన్ వ్యూహం మార్చారు. ఆయన తన వెంట.. మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని తీసుకెళ్లడానికి ఆసక్తి చూపారు. అమిత్ షాతో భేటీ సమయంలోనూ.. హోంమంత్రి ఇంటికి సాయిరెడ్డి, మిథున్ రెడ్డి వెళ్లలేదు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సాయిరెడ్డికి గుర్తింపు ఉంది. ఆయనే ప్రభుత్వం తరపున వ్యవహారాలు చక్కబెట్టాలి. అయితే ఆయన మాత్రం ఈ పర్యటనలో ఓ పరిమిత పాత్రకే పరిమితమయ్యారు.
అయితే అనూహ్యంగా వారిద్దరూ.. ఆంధ్రభవన్లో ఓ కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే… అమిత్ షా నివాసానికి వెళ్లక ముందే జరిగింది. ప్రధానమంత్రి కార్యాలయ అధికారులతో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఆ సమావేశ ఎజెండా ఏమిటో స్పష్టత లేదు .. కానీ రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలపై మాట్లాడినట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లినప్పటి నుండి వైసీపీ ఒకే టార్గెట్గా పని చేస్తోంది. అదే రాజదాని భూములపై.. ఫైబర్ నెట్ స్కాంపై సీబీఐ విచారణ.
రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలతో పాటు.. ఈ అంశాలపైనా… వారిద్దరూ పీఎంవోతో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. కారణం ఏదైనా.. జగన్మోహన్ రెడ్డి… తమ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతలను… ప్రభుత్వ ప్రతినిధి.. ఇంకా చెప్పాలంటే.. పార్టీలో తన తర్వాత అన్నీ చూసుకునే విజయసాయిరెడ్డి అమిత్ షాతో భేటీకి జగన్ తీసుకెళ్లకపోవడం… వైసీపీలో కొత్త పరిణామంగా అంచనా వేస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నదేనని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.