సీఎం జగన్ తిరుమల పర్యటనకు వస్తున్నారనేసరికి.. ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఆయన జగన్ కొండపైకి రాక ముందే పద్మావతి అతిథిగృహం వద్దకు చేరుకుని తనకు మద్దతుగా ఉన్న కొంత మంది అర్చకులను తీసుకుని వెయిట్ చేశారు. జగన్ రాగానే తన వాదన వినిపించాలనుకున్నారు. కానీ మొదటి సారి జగన్ ఓ నమస్కారం పెట్టి తర్వాత మాట్లాడదామని చెప్పి పంపేశారు. పనులన్నీ అయినపోయిన తర్వాత ఓ ఐదు నిమిషాలు మాట్లాడారు. కానీ రమణ దీక్షితులకు మాత్రం.. నిరాశే ఎదురయింది. ఇంతకీ ఆయన సమస్య ఏమిటంటే.. మళ్లీ శ్రీవారి ఆలయంలోకి ప్రధాన అర్చకుడిగా వెళ్లడం.
గత ఎన్నికలకు ముందు రమణదీక్షితులు ఆలయ ప్రధాన అర్చకులుగా ఉండేవారు. ఆయనకు ఏం లోటు అనిపించిందో కానీ..ఒక్క సారిగా ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు ప్రారంభించారు. చెన్నై వెళ్లి ఆలయంలో పింక్ డైమండ్ గురించి.. పోటులో తవ్వకాల గురించి చెప్పడం ప్రారంభించారు. ఆ తర్వాత లోటస్ పాండ్ వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు. తిరమలలో శ్రీవారి సేవ చేయాల్సిన వ్యక్తి రాజకీయ కుట్రలో భాగమయ్యారని అప్పటి ప్రభుత్వం ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చేసింది. దాంతో పదవి ఊడిపోయింది. అయితే అప్పట్లో జగన్ మీరేమీ బాధపడవద్దు మన ప్రభుత్వం రాగానే.. మీ పదవి మీకిస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రకారం జగన్ గెలిచినప్పటి నుండి ఆయన మళ్లీ తనకు శ్రీవారి ఆలయంలో ప్రధానార్చక పదవి వస్తుందని ఆశ పెట్టుకున్నారు. కానీ ఆయనకు గౌరవ ప్రధానార్చక పదవి ఇచ్చారు. దాన్ని పెట్టుకుని ఆలయంలో పెత్తనం చేసేందుకు ప్రయత్నించారు కానీ.. ఇతర అర్చకులు పడనీయలేదు. దాంతో ఆయన కొండపైకి రావడం తగ్గించేశారు.
రాజకీయ విమర్శల కారణంగా కోల్పోయిన తన పాత పదవిని తనకు.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఇప్పించాలని జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఆయన ఆశించిన ఎఫెక్ట్ మాత్రం రావడం లేదు. కనీసం జగన్ ను కలిచేందుకు సమయమూ దొరకలేదు. చివరికి తిరుమల వచ్చినప్పుడు వెళ్లి కలిసినా… ఊరట మాటలే తప్ప.. హామీ నెరవేరే అవకాశం కనిపించలేదు. రాజకీయం కోసం శ్రీవారి ఆలయంపై రకకాల చర్చలకు కారణమయ్యేలా చేసిన రమణదీక్షితులు తన పదవిని పోగొట్టుకున్నారు.. ఇప్పుడా పదవి కోసం మళ్లీ ఆరాటపడుతున్నారన్న అభిప్రాయం.. భక్తుల్లో వినిపిస్తోంది.