తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ పెద్ద పెద్ద వికెట్లనే కూలదోస్తోంది. అడిషనల్ కలెక్టర్ నగేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని శ్రీకృష్ణజన్మస్థానానికి పంపగా.. తాజాగా.. అడిషనల్ పోలీస్ కమిషనర్‌నే పట్టేసింది. మల్కాజ్ గిరి ఏసీపీ గా పని చేస్తున్న నరసింహారెడ్డి దందాల్లో రాటుదేలిపోయి… కోట్లలో ఆస్తులు కూడబెట్టుకున్నట్లుగా స్పష్టమైన సమాచారం ఉండటంతో ఆయనను బయటకు లాగేశారు. మొత్తంగా ఇరవై ఐదు చోట్ల ఏక కాలంలో సోదాలు చేశారు. బహిరంగ మార్కెట్లో వంద కోట్లకుపైగా విలువ ఉండే ఆస్తులను గుర్తించారు.
ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమాస్తులు తెలుగు రాష్ట్రాలు మొత్తం విస్తరించాయి. వరంగల్, కరీంనగర్ , నల్గొండ, అనంతపురంలో ఆస్తులున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధితో.. నర్సింహారెడ్డి అత్యంత చనువుగా ఉంటారు. ఆయనకు బినామీగా ఉండటం లేదా.. ఆయన తరపున బినామీలను వెదికి పెట్టడం లాంటి పనులు చేస్తూంటారని చెబుతూ ఉంటారు. కింది స్థాయి నుంచి ఏసీపీ స్థాయికి ఎదిగిన నర్సింహారెడ్డి ఎక్కువగా శివారు ప్రాంతాల్లోనే విధులు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలోలో ఓ ఎంపీపీ కూడా నరిసింహారెడ్డికి బినామీ ఉన్నట్లుగా గుర్తించారు. ఓ ప్రజా ప్రతి నిధికి పోలీస్ అధికారి ఉన్న లింక్ లు పై విచారణ చేసిన ఏసీబీ చివరకు ల్యాండ్ కి సంబంధించిన లావాదేవీలు ఉన్నట్లుగా గుర్తించారు.. ఆ సమయంలో భూ వివాదాలు చుట్టుముట్టాయి. సెటిల్మెంట్లు చేసే వారన్న ఆరోపణలు వచ్చాయి. కానీ ఆయనకు రాజకీయంలో పలుకుబడి ఉంది. అందుకే.. ఇప్పటి వరకూ పెద్దగా ఎవరూ కన్నెత్తి చూడలేదు.
ఏసీపీ నరసింహ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు తెలంగాణా పోలీస్ శాఖ లో కలకలం రేపుతున్నాయి. పెద్ద స్థాయిలో ఉండే పోలీసు అధికారులపై దాడులు చేస్తే.. ఇదే స్థాయిలో ఆస్తులు బయటపడతాయన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే.. టార్గెటెడ్‌గా కొంత మందిపైనే ఏసీబీ దృష్టి పెట్టి.. దాడులు చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో కొంత మంది పోలీసు అధికారుల్లో కలవరం ప్రారంభమయింది. అయితే.. ఇలాంటి కేసులన్నీ… అప్పటికప్పుడు సంచలనం సృష్టిస్తాయి కానీ.. తర్వాత నరసింహారెడ్డి యధావిధిగా విధుల్లో చేరిపోతారు. తన పని తాను చేసుకుంటారు.. అనాదిగా జరుగుతోంది ఇదే..!