ఓ గానం ఆగింది. సంగీత ప్రపంచాన్ని విషాద సాగరంలో ముంచుతూ ఓ పాట అస్తమించింది. దిగ్గజ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (74) తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం కరోనాతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన బాలు.. పరిస్థితి విషమించడంతో ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. బాలు మరణంతో – సంగీత ప్రపంచం ఓ అద్భుత గాయకుడ్ని కోల్పోయినట్టైంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇలా.. భాషతో పని లేకుండా సంగీత ప్రపంచాన్ని, శ్రోతలనూ తన గాత్రంతో ఓలలాడించిన బాలు.. దాదాపు 40 వేలకు పైగానే పాటలు పాడారు. దాదాపు మూడు దశాబ్దాలు అలుపు లేకుండా పాడుతూనే ఉన్నారు. పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎన్నో కొత్త గళాల్ని వెలుగులోకి తెచ్చారు. బాలు కృషికి 2001లో పద్మశ్రీ వరించింది. 2011లో పద్మభూషణ్ సైతం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే నంది అవార్డుల్ని ఏకంగా 25 సార్లు అందుకున్నారు.
బాలు పూర్తి పేరు పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో జన్మించారు. తండ్రి సాంబమూర్తి, తల్లి శంకుతలమ్మ. తండ్రి హరి కథా కళాకారుడు. అందుకే పాడడం ఇంట్లోనే ఉంది. తండ్రిని చూస్తూ… బాలు కూడా పాడడం మొదలెట్టారు. ఇంజనీరింగ్ చదువుతూ.. వేదికలపై పాటలు పాడడం మొదలెట్టారు. 1966లో `మర్యాదరామన్న` సినిమాతో తొలిసారి గాయకుడి అవతారం ఎత్తారు. అప్పటి నుంచి.. ఆయన వెను దిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. కథానాయకుడి శైలిని, గొంతునీ అనుసరిస్తూ పాటలు పాడడం బాలు ప్రత్యేకత. కృష్ణ, అక్కినేని, చిరంజీవి, బాలకృష్ణ.. ఎవరికి పాట పాడుతున్నారో గ్రహించి – దానికి తగ్గట్టు తన గొంతు మార్చుకునేవారు.
నటన బాలుకి మంచి హాబీ. చాలా చిత్రాల్లో కీలకమైన పాత్రలు పోషించి అలరించారు. ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం, ఆరోప్రాణం, రక్షకుడు, దీర్ఘసుమంగళీ భవ, మిథునం లాంటి చిత్రాలు బాలులోని నటుడ్ని వెండి తెరపై సాక్ష్యాత్కరింపజేశాయి. డబ్బింగ్ కళాకారుడిగానూ బాలు ఖ్యాతి గడించారు. కమల్ హాసన్, రజనీకాంత్ లకు గాత్రదానం చేశారు. దాదాపు 40 చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోదండపాణి కి గురు స్థానం ఇచ్చారు బాలు. అందుకే తన ఆడియో ల్యాబ్‌కి `కోదండపాణి ఆడియో ల్యాబ్` అని పేరు పెట్టుకున్నారు. బాలు అర్థాంగి సావిత్రి. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. అందులో ఎస్.పి.చరణ్ గాయకుడిగా, నిర్మాతగా చిత్రసీమకు పరిచయమే. చెల్లాయి ఎస్.పి. శైలజ గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా రాణించారు.