దుబ్బాక ఉపఎన్నికకు షెడ్యూల్ వచ్చేస్తుందని పరుగులు పెడుతున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించింది కానీ ఉపఎన్నికలను నిర్వహించాలని మాత్రం నిర్ణయించుకోలేదు. కొద్ది రోజుల బీహార్ అసెంబ్లీతో పాటే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 60కి పైగా అసెంబ్లీ స్థానాలను కూడా భర్తీ చేసేందుకు ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ చెప్పింది. అయితే ఇప్పుడు కేవలం బీహార్ కు మాత్రమే షెడ్యూల్ రిలీజ్ చేసింది. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.. వర్షాలు, కరోనా పానడమిక్ కారణంగా ఉపఎన్నికలపై మళ్లీ నిర్ణయం తీసుకుంటామని ఈసీ చెబుతోంది.
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు మొదటి వారంలో మృతి చెందారు. ఆరు నెలల కాలంలో ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే బీహార్ ఎన్నికలతో పాటే ఉపఎన్నిక నిర్వహించేస్తారనుకున్న రాజకీయ పార్టీలు నెల రోజుల నుంచే సన్నాహాలు ప్రారంభించాయి. ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ బాధ్యతలు తీసుకుంటున్న హరీష్ రావు రోజూ అక్కడే పర్యటిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. రాజకీయ సభలు.. సమావేశాలు పెడుతున్నారు. రైతుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మరింత జోరుగా ప్రచారం కూడా చేసేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పుడు వీరందరూ ముందే తొందరపడినట్లయింది. సాధారణంగా ఓ ఎమ్మెల్యే చనిపోతే వచ్చే ఉపఎన్నికకు పెద్ద హడావుడి ఉండదు. కానీ దుబ్బాక విషయంలో మాత్రం.. ఫుల్ రేస్ నడుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అన్న మాటే వినిపించడం లేదు. తెలంగాణ జనసమితి కూడా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పటికే ఎలక్షన్ ఫీవర్ అక్కడ తారస్థాయికి చేరింది. ఇప్పుడు షెడ్యూల్ రాకపోవడంతో కాస్త నెమ్మదించే అవకాశం ఉంది.