ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించారా..? నో.. నెవ్వరు..! ఎక్కడ చూసినా ఆయన గొంతే వినిపిస్తూంటే ఆయన లేరని చెప్పడానికి నోరెలా వస్తుంది..?. ఇప్పుడు కాదు..పుట్టినప్పటి నుండి ఊహ తెలిసినప్పటి నుండి.. రెడియోల్లో పాటలు వినడం దగ్గర్నుంచి ప్రారంభించి ఇవాళ ఐపాడ్ వరకూ ఎన్నో గాడ్జెట్స్ వచ్చినా.. అన్నింటిలోనూ ఆయన వినిపిస్తూనే ఉన్నారు. అలాంటిది ఆయనకు మరణం ఏమిటి..?
ఎనభైల్లో.. తొంభైల్లో మాత్రమే కాదు… ఆ తర్వాత కూడా ప్రధాన హీరోల సినిమాలన్నీ సింగిల్ కార్డే. ఆయన స్వరంతో హిట్టయిన సినిమాలు కోట్లకు కోట్లు సంపాదించాయి. ఆయన స్వరంతో ఉన్న పాటల్లో డాన్సులు చేసి హీరోలు స్టార్లయ్యారు. ఆయన స్వరం నిరాశలో కూరుకుపోయిన వారికి ఓ టానిక్. ఉదయమే ఆయన నోటి నుంచి జాలువారే పాటలు వాకింగ్ చేస్తూనో..యోగా చేస్తూనో.. మరో పని చేస్తూనే వింటూంటే.. ఆ రోజంతా తెలియని ఉత్సాహం ఉంటుంది. అందుకే ఆయనకు మరణం లేదు.
సినీ సంగీత ప్రపంచానికి అసలైన నాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ప్రముఖ గాయకులుగా పేరుపొందిన ఎంతో మంది ఆయన సారధ్యంలో సాగిన సంగీత కార్యక్రమాల్లో పాటలు పాడి .. ఆయన సూచనలు ..సలహాలతో ఎదిగినవారే. ఆయన పాటల పూదోటలో విసిరిన గాయకులు.. సంగీత దర్శకులు లెక్కలేనంత మంది ఉన్నారు. ఎక్కడ తీయగా పాట వినిపించినా బాలునే కనిపిస్తారు. వారందరిలో బాలూ జీవించే ఉంటారు.
ఎస్పీబీ ఎవరినీ ఇంప్రెస్ చేయలేదు. అలా చేయాలని కూడా అనుకోరు. కానీ ఆయన పాటలు విన్నా.. ఆయన మాటలు విన్నా.. ఆయన నటన చూసినా ఇంప్రెస్ కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన ప్రధానంగా గాయకుడు కాబట్టి ఆ రంగంలో ఆయన అధిరోహించిన శిఖరాల గురించి చెప్పుకుంటారు. ఆయన ఇతర కళా ప్రదర్శనలు తక్కువేమీ కావు. నటించినా…డబ్బింగ్ చెప్పినా.. ప్రతిభాప్రదర్శన వెలికితీతలో జడ్జిగా వ్యవహరించినా.. ఆయన స్టైల్వేరు. కొత్త గాయకులకు సూచనలు .. సలహాలు ఇచ్చినా లోపాలు ఎత్తి చూపినా… ఆయన చెప్పే విధానంలో ఓ మ్యాజిక్ ఉంటుంది. అందులో జీవిత సత్యాలుంటాయి.
నేపధ్యగానం అంటే.. తెర వెనుక ఉండేవారు. తెర మీద హీరో పాడుతున్నట్లుగా ఉంటుంది. బయట చెప్పుకునేది కూడా.. చిరంజీవి పాట.. బాలకృష్ణ పాటు.. అని హీరోల పేర్లతోనే. కానీ బాలు తన స్వరంతోనే ప్రేక్షకుల మనసు తెరలను తోసుకుని వచ్చేశారు. తరాలను తీర్చిదిద్దారు.. అంతరాలను చెరిపేశారు.. శబ్దాన్ని సంగీతంగా మార్చి…ప్రేక్షకుడికి అందించాడు. అందుకే అమరజీవి అయ్యారు. మరణం లేని మహా మనిషి అయ్యారు.