జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్న భావనతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ న్యాయపోరాటం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ దిశగా కేసీఆర్‌కు గొప్ప అస్త్రం లభించింది. నిజంగానే కేంద్రం జీఎస్టీ సెస్‌ను దారి మళ్లించిందని అధికారికంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేసింది. వాస్తవానికి ఆ నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలి . కానీ ఇవ్వలేదు. కావాలంటే ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోండి అని ఆఫర్ ఇస్తోంది. కానీ న్యాయంగా ఇవ్వాల్సిన సొమ్మే కాబట్టి ఇవ్వాలని తెలంగాణ సర్కార్ పట్టు బడుతోంది. ఈ తరుణంలో కాగ్ నివేదిక కొత్త సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
జీఎస్టీ చట్టం ప్రకారం.. రాష్ట్రాలకు జీఎస్టీ ఆదాయం తగ్గితే పరిహారం చెల్లించాలి. ఆ పరిహారం కోసం.. సెస్‌ను కూడా వసూలు చేస్తున్నారు. జీఎస్టీ అమలు చేసిన తొలి రెండేళ్లలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం కన్నా ఎక్కువగా సెస్ వసూలయింది. ఇది దాదాపుగా రూ. 47వేల కోట్లు ఉంది. ఈ మొత్తం ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంది. కానీ.. కేంద్రం ఇవ్వలేదు. యాక్ట్ ఆఫ్ గాడ్ పేరుతో నిర్మలా సీతారామన్ వాటిని ఇవ్వడానికి నిరాకరించారు. వేరే మార్గం ద్వారా నిధులు సమీకరించుకోవాలని సూచించారు. ఇలా చేయడం కేంద్రం చట్టాన్ని ఉల్లంఘించడమేనని కేసీఆర్ అంటున్నారు.
ఈ నిధులను కేంద్రం ఇతర అవసరాలకు వినియోగించిందని కాగ్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ అంశం ద్వారా కేసీఆర్ కేంద్రంపై కోర్టులో న్యాయపోరాటానికి చేయడానికి అవకాశం చిక్కినట్లయింది. జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా… కాగ్ స్పష్టంగా పేర్కొనడంతో.. కోర్టులోనూ.. వాదనలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కేసీఆర్‌తో పాటు.. ఏపీ లాంటి కొన్ని కేంద్రంపై భయభక్తులతో ఉండే రాష్ట్రాలు మినహా.. మిగతా బీజేపీయేతర అధికార పార్టీలన్నీ.. కేంద్రంపై పోరాటానికే సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో కాగ్ రిపోర్ట్ మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదే..!