వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సుదీర్ఘ విరామం తరవాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోవాలనుకున్నారు. అందుకు సంబంధించిన స్క్రిప్టు కూడా తయారు చేసుకున్నారు. బెంగళూరు నారత్నమ్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కే చిత్రమిది. ఆ పాత్రలో సమంత లాంటి స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే సమంతతో సంప్రదింపులు మొదలయ్యాయి. దాదాపుగా ఆమెతోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది.
అయితే.. ఈ సినిమా విషయంలో సింగీతం ప్లాన్ మారింది. ఆయన దర్శకత్వానికి దూరంగా జరగాలని భావిస్తున్నారని సమాచారం. తన దగ్గర శిష్యరికం చేసి ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్న దర్శకులలో ఒకరికి ఆ బాధ్యత అప్పగించి – తాను దర్శకత్వ పర్యవేక్షణ చేయాలన్న నిర్ణయానికొచ్చారని తెలుస్తోంది. సంగీతం వయసు మీరిపోతోంది. దానికి తోడు.. ఈమధ్య కరోనా సోకింది. ఇతర అనారోగ్య సమస్యలేవీ లేవు కానీ.. ఇది వరకటి ఉత్సాహం తగ్గుతుంది కదా. పైగా ఇప్పటి సినిమా ప్రొడక్షన్, మేకింగ్ అన్నీ మారిపోయాయి. సమంత తో పాటు స్టార్ కాస్టింగ్ కూడా భారీగా ఉండే సినిమా ఇది. వాళ్లందరినీ, ఈ వయసులో డీల్ చేయడం కష్టం అవుతుందని సింగీతం భావిస్తున్నార్ట. అందుకే… ఈసారికి ఆయన దర్శకత్వ పర్యవేక్షణకు పరిమితం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.