ఈ కరోనా కాలంలో.. రియల్ హీరోగా మారిపోయాడు సోనూసూద్. కష్టాల్లో ఎవరున్నా సరే, నేనున్నా అంటూ ఆపన్నహస్తం అందించాడు. అక్కున చేర్చుకున్నాడు. వలస కూలీల పాలిట దేవుడిగా మారిపోయాడు. ఏ రాజకీయ నాయకుడూ చేయని సాయం.. సోనూసూద్ రూపంలో అందింది. అందుకే.. సోనూ ఇప్పుడు హీరో అయిపోయాడు.
సుదీర్ఘ విరామం తరవాత… షూటింగ్ సెట్లో అడుగు పెట్టిన సోనూసూద్‌కి ఘన స్వాగతం లభించింది. ప్రస్తుతం ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న `అల్లుడు అదుర్స్`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సోమవారం సోనూ సెట్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోనూని సాదరంగా ఆహ్వానించింది. ప్రకాష్ రాజ్ శాలువా కప్పి, అభినందిస్తూ, సోనూని సెట్లోకి ఆహ్వానించారు. ఓ నటుడికి ఈ తరహా ఆహ్వానం పలకడం, ఈమధ్య కాలంలో చూళ్లేదు. సంతోష్ శ్రీన్వాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనూ – ప్రకాష్ రాజ్ మధ్య కొన్ని సన్నివేశాల్ని పూర్తి చేయాల్సివుంది. దాంతో పాటు పాటలూ చిత్రీకరిస్తే ఈ సినిమా పూర్తయినట్టే.