ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీని సోషల్ మీడియా వెంటాడుతోంది. ఆయనపై రకరకాల ప్రచారాలకు నెటిజన్ల పేరుతో కొంత మంది బరి తెగిస్తున్నారు. అవి వారి ఫ్యామిలీని తీవ్రంగా వేధిస్తున్నాయి. చివరికి బాలు కుమారుడు ఎస్పీ చరణ్ మీడియా ముందుకు వచ్చి.. ఇదేం పద్దతని ప్రశ్నించాల్సి వచ్చింది. బాలు చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో తెలుగు వారు అనేక రకాలుగా చర్చించారు. ఆయన కులం దగ్గర్నుంచి ఆయన చావుకు ఫలానా వారు కారణం అనే వరకూ అన్ని రకాలు విశ్లేషించారు. అందులో ఒక్కటీ నిజం లేదు. రాజకీయంగా ఒకరిపై ఒకరు..కులాల పరంగా ఇతరులపై నిందలు వేసుకోవడానికి బాలు మరణాన్ని ఉపయోగించుకున్నారు.
ఈ రచ్చ ఇలా సాగుతూండగానే.. తమిళనాడులో మరో రకమైన ప్రచారం జరిగింది. అదేమింటే… బాలు ఆస్పత్రి బిల్లు కట్టలేదని..భౌతిక కాయాన్ని ఆలస్యంగా ఇచ్చారని ఇలా.. రకరకాలుగా చెప్పుకుంటూ పోతున్నారు. ఎన్ని చెప్పుకున్నా.. ఇది ఎంజీఎం ఆస్పత్రి రెప్యూటేషన్ దెబ్బతినేలా ఉండటంతో ఎస్పీ చరణ్ మీడియా ముందుకు వచ్చారు. ఆస్పత్రిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. బిల్లు మొత్తం చెల్లించేశామని… ఎస్పీ చరణ్ స్పష్టం చేశారు.
ఎవరైనా ఓ ప్రముఖుడు చనిపోతే… రకరకాల ఫేక్ వార్తలను పట్టించి సర్క్యూలేట్ చేసే సంస్కృతి అంతకంతకూ పెరిగిపోతోంది. దానికి ప్రాతిపదిక ఉండదు. అసత్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి .. అదే పనిగా చెప్పిందే చెప్పడం వల్ల నిజమే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలే ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నాయి. ఇలాంటి వాటి వల్ల నియంత్రణ లేకపోవడంతో… చనిపోయిన ప్రముఖుల కుటుంబాలు.. మరో విధంగా మనో వేదనకు గురి కావాల్సి వస్తోంది.