విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్. ప్రత్యర్థి ఎవరైనా, ఫార్మెట్ ఏదైనా – బౌలర్లపై భీకరంగా విరుచుకుపోవడమే తనకు తెలుసు. ఐపీఎల్ అంటే.. మరింత చెలరేగిపోతాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు… కోహ్లీదే. అయితే ఈ ఐపీఎల్ లో విరాట్ కి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. విరాట్ బ్యాటింగ్ చూస్తే అతి సాధారణమైన బ్యాట్స్‌మెన్ అయిపోయాడేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. ఈ మూడు మ్యాచ్‌లలో కోహ్లీ స్కోరు కేవలం 18 మాత్రమే. వరుసగా మూడు మ్యాచుల్లోనూ తక్కువ స్కోర్లకు అవుట్ అవ్వడం కోహ్లీ కెరీర్లో బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. పైగా కోహ్లీ అవుట్ అయిన బంతులేమీ అద్భుతం అనదగ్గవేం కాదు. అతి సాధారణమైన బంతులే. ఫామ్‌లో ఉన్నప్పుడు ఆయా బంతుల్ని అవలోకగా బౌండరీలకు తరలిస్తాడు కోహ్లీ. ఎందుకో.. బ్యాటింగ్ కి దిగినప్పుడు కోహ్లీ ఇది వరకెప్పుడూ లేనంత ఒత్తిడికి లోనవుతున్నాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో కోహ్లీ ఒకడు. కానీ.. తన చేతుల్లోంచి క్యాచులు చేజారిపోతున్నాయి. పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ రెండు అమూల్యమైన క్యాచులు నేల పాలు చేశాడు. రెండూ కె.ఎల్.రాహుల్ వే. కోహ్లీ క్యాచులు వదిలేశాక.. రాహుల్ మరింత రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. రాహుల్ క్యాచ్‌లను వదిలేయడమే పెద్ద తప్పిదమని, అదే మ్యాచ్ ఫలితాన్ని శాశించిందని కోహ్లి సైతం స్వయంగా ఒప్పుకున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కూడా కోహ్లీ ఫీల్డింగ్ చాలా సాధారణంగా కనిపించింది. బెంగళూరుకు బలం కావాల్సిన కోహ్లీ.. ఇలా.. బలహీనతగా మారడం ఆ జట్టు విజయావకాశాల్ని దెబ్బ తీస్తోంది. అయినా ఇప్పటికీ మించిపోయిందేం లేదు. కోహ్లీకి ఒక్క మ్యాచ్ చాలు. తిరిగి లయ అందుకోవడానికి. తను టచ్‌లోకి వస్తే.. ఎప్పటిలానే బౌలర్లకు నిద్రలేని రాత్రులు మిగులుస్తాడు. అసాధారణమైన ఇన్నింగ్స్ లతో అదరగొట్టేస్తాడు. టోర్నీలో.. పించ్, డివిలియర్స్, దూబే.. వీళ్లంతా మ్యాచ్‌లను కాపు కాస్తున్నారు. వాళ్లకు కోహ్లీ కూడా తోడైతే – తప్పకుండా ఈ ఐపీఎల్ వేటలో బెంగళూరు ముందుంటుంది.