ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య మళ్లీ రేస్ ప్రారంభమయింది. ఈ సారి ముఖ్యమంత్రి అభ్యర్థిని తానంటే తానని.. ఇప్పటి నుంచి ఒకరుకొకరు చొక్కాలు పట్టుకోవడం ప్రారంభించారు. సోమవారం జరిగిన అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంలో జిరగింది ఇదే. ఇద్దరూ తిట్టుకోవడం ప్రారంభించడంతో సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. ఇద్దరూ ముఖ్యమంత్రి అభ్యర్థిని తనంటే తాను అని పోటీ పడుతున్నారు.
సీఎం పీఠంపై పీటముడి చాలా రోజులుగా కొనసాగుతోంది. జయలలిత చనిపోయినప్పుడు పన్నీర్ సెల్వంను సీఎంను చేశారు. తర్వాత శశికళ ఆ పదవి దక్కించుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఆమె జైలుకెళ్లారు. ఆ సమయంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో పళని స్వామి .. శశికళ మద్దతుతో సీఎం అయ్యారు. తర్వాత ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆయన బీజేపీకి దగ్గరయ్యారు. పన్నీర్‌ను తర్వాత సమాధాన పరిచిన బీజేపీ ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇప్పించింది. అప్పటి నుంచి ఇరు వర్గాలు కత్తులు దూసుకుంటూనే ఉన్నాయి. ఎక్కడా పొసగడం లేదు. ఒకరి ఆధిపత్యాన్ని ఒకరు చెక్ పెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ఇందులో అసలు కొసమెరుపేమిటంటే.. ఎన్నికల కంటే ముందే శశికళ జైలు నుంచి విడుదలవుతారనే ప్రచారం. ఆమె కోర్టు తీర్పు ప్రకారం జరిమానా చెల్లించాల్సి ఉంది. రూ. పది కోట్లు చెల్లిస్తే.. సత్ఫ్రవర్తన కింద.. ఆమెను వచ్చే జనవరిలో విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దినకరన్ ఇప్పటికే.. బీజేపీతో రాజీ చర్చలు జరిపారని.. ఈ మేరకు ఆమె విడుదల ఖరారయిందని అంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఈపీఎస్, ఓపీఎస్ బహిరంగంగా పోట్లాడుకుంటున్నారు. ఒక వేళ శశికళ నిజంగా విడుదలైతే.. బీజేపీ మద్దతు లేకుండా సాధ్యం కాదు. అలా ఆమె బీజేపీతో రాజీ పడితే.. అన్నాడీఎంకే ఆటోమేటిక్‌గా ఆమె చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఇద్దరూ శశికళ ఎదుట సాగిల పడాల్సిందే.