హైదరాబాద్: కేరళకు చెందిన నయనతార, సమంత, నిత్యామీనన్ తెలుగు చలనచిత్రపరిశ్రమలో రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. వీరు ముగ్గురికీ ఒక కామన్ పాయింట్ ఏమిటంటే వీరంతా బాగా పొట్టి… 5 అడుగులలోపే ఉంటారు. అయితే పొట్టిగా ఉన్నందుకు తానెప్పుడూ బాధపడలేదని చెబుతోంది నిత్యా కుట్టి. నిన్న ప్రసారమైన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎత్తు తక్కువగా ఉన్నానని ఫీలయ్యారా అని వేమూరి రాధాకృష్ణ అడగగా, పాజిటివ్‌గా ఎన్ని ఉన్నా జనాలు మాట్లాడరని, ఏది నెగెటివ్‌గా ఉంటే అది మాట్లాడతారని నిత్య బదులిచ్చారు. తనకు దేవుడు చాలా ఇచ్చాడని, ఎత్తు లేనందుకు ఎందుకు బాధపడాలని అన్నారు. బస్సులో కూర్చునేటప్పుడు పొడుగువారికి సమస్యగా ఉంటుందని, తనకు ప్రాబ్లమ్ అనేది ఉండదని, ట్రైన్లో పడుకునేటపుడు తన కాలు బెర్త్ దాటి వెళ్ళదని, విమానంలో కూడా కంఫర్ట్‌గా ఉంటుందని చెప్పారు. షూటింగ్ సమయంలో ప్లాస్టిక్ ఛైర్లోనే మడుచుకుని కూర్చుని తాను నిద్రకూడా పోతానని, అది చూసి హీరోలు ఆశ్చర్యపోతుంటారని తెలిపారు. పొడుగువాళ్ళకు అన్నీ ప్రాబ్లమ్సేనని నిత్య అన్నారు. మొత్తం మీద ఈ ఇంటర్వ్యూలో తన సమాధానాలు చూస్తే ఆమె సగటు హీరోయిన్ కాదని, లోతైన ఆలోచనలు, విశాల దృక్పథం ఉన్న మనిషని తెలుస్తోంది.