ఇండ్రస్ట్రీలో ఎప్పుడూ ఓ మాట వినిపిస్తుంటుంది. ”బడా స్టార్లు పారితోషికాలు తగ్గించుకోవాలి..” అని. తరాలు మారినా, పరిస్థితులు మారినా.. ఈ మాట మాత్రం మారలేదు. హీరోలు పారితోషికాలు తగ్గించుకోలేదు.. నిర్మాతలు తగ్గించి ఇచ్చిన సందర్భాలూ కనిపించలేదు. ఇప్పుడు మరోసారి పారితోషికాల తగ్గింపుపై డిబేట్ జరుగుతోంది. ఏకంగా ప్రొడ్యూసర్ గ్రిల్డ్ నే ఓ సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో హీరోల మేనేజర్లని పిలిపించి ”మీ హీరోలు పారితోషికాలు తగ్గించుకోకపోతే కుదర్దు..” అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం చూస్తే.. ఇది మరో పెద్ద జోక్ అని నవ్వుకోక తప్పదు.
కరోనా తరవాత సినిమా బడ్జెట్లలోనూ, పారితోషికాల్లోనూ విపరీతమైన మార్పులొస్తాయని, కాస్ట్ కటింగ్ తప్పదని, హీరోల పారితోషికంలో భారీ కోత ఉంటుందని రకరకాల వార్తలొచ్చాయి. తమిళనాట కొంతమంది హీరోలు తమ పారితోషికాలలో కొంత మొత్తం వెనక్కి ఇచ్చారు. ‘మా పారితోషికాలు తగ్గించుకుంటున్నాం’ అని ప్రకటించారు. అవి ఎంత వరకూ వర్కవుట్ అయ్యాయో లేదో తెలీదు గానీ, ప్రకటనలైతే వచ్చాయి. తెలుగులో అలాంటి మాటలే వినిపించలేదు. ప్రొడ్యూసర్ గ్రిల్డ్ మీటింగు పెట్టి, పారితోషికాలు తగ్గించుకోవాలని డిమాండ్ చేసేశారని, హీరోలు ఖంగారు పడిపోయి – వెంటనే వాటిని అమలు చేస్తారనుకోవడం, కనీసం భవిష్యత్తులో అయినా పారితోషికాలు తగ్గుతాయని, బడ్జెట్లలో కోతలు పడతాయని ఊహించుకోవడం అత్యాసే అవుతుంది.
చిత్రసీమ చాలా మారింది. ఇది వరకు `సినిమా` బీజం నిర్మాత మొదడులో పడేది. ఓ కథని ఎంచుకుని, దానికి తగిన నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్నీ ఎంచుకుని, వాళ్లకు తగిన పారితోషికాల్ని అందించే వారు. ఇప్పుడు ఆ సంప్రదాయం లేదు. హీరో – దర్శకుడు కూర్చుని కథపై డస్కర్స్ చేసుకుని, తమకు అందుబాటులో ఉన్న నిర్మాతల్ని పిలిపించుకుని `ఈ సినిమా మీరే చేయండి` అంటూ ఆయన చేతిలో పెడుతున్నారు. అంటే ఈ ప్రాజెక్టులోకి చివర్న ఎంటర్ అయ్యేది నిర్మాత అన్నమాట. హీరో పారితోషికాన్ని నిర్మాత ఫిక్స్ చేసే సంప్రదాయం ఎప్పుడో మారిపోయింది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో దగ్గరకు వెళ్లి `మీకు ఇంత పారితోషికం ఇద్దామనుకుంటున్నా` అని చెప్పే దమ్ము, సాహసం ఎవరైనా చేయగలరా? `నా పారితోషికం ఇంత ఇవ్వండి` అని హీరోలు డిమాండ్ చేయడం తప్ప – నిర్మాతలు ఫిక్స్ చేయడం, ఆ తరవాత బేరాలకు దిగడం లేనే లేవు.
ఎప్పుడైతే నిర్మాతలు హీరోల వెంట, దర్శకుల వెంట పడడం మొదలెట్టారో అప్పుడే పారితోషికాల పగ్గాలు వదులుకున్నట్టైంది. హీరోలు డేట్లు ఇవ్వడమే మహా ప్రసాదం అనుకుంటుంటే పారితోషికం ఇంతే ఇస్తా.. చేస్తే చేయండి, లేదంటే లేదు… అని నిర్మొహమాటంగా చెప్పే అవకాశం ఎందుకు ఉంటుంది? ఎవరికి ఉంటుంది? లేదూ.. హీరోలు పారితోషికాలు తగ్గించాల్సిందే అని పట్టుబడితే… అది నిర్మాతలకే నష్టం. `మా బ్యానర్లు మాకున్నాయి.. మీతో అవసరం లేదు` అని హీరోలు తెగించే ప్రమాదం కూడా ఉంది. ఇది కేవలం హీరోలకే వర్తించదు. హీరోయిన్లూ, స్టార్ దర్శకులూ ఇదే పంథా అనుసరిస్తున్నారు. పారితోషికాల్లో ఏదైనా మిగుల్చుకోవాలంటే విలన్లు, సైడ్ క్యారెక్టర్లు, సంగీత దర్శకుల్లాంటి సాంకేతిక నిపుణుల దగ్గర.. రిబేటు మిగుల్చుకోవాలి. అంతే తప్ప… బడా హీరోల దగ్గర ఈ పప్పులు ఉడకవు. వాళ్లు స్వతహాగా పారితోషికాలు తగ్గించుకోవాలి తప్ప, ఇక్కడ డిమాండ్లు పనిచేయవు.