భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి పొందిన ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి ప్రశంసలు కన్నా ఏపీలో ఎక్కువగా విమర్శలే వస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన నేతలు పెద్దగా అభినందించినట్లుగా కనిపించలేదు కానీ వైసీపీ నేతలు మాత్రం విమర్శలు ప్రారంభించారు. విజయసాయిరెడ్డి లాంటి నేతలు దారుణమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అయితే బీజేపీ నుంచి పెద్దగా ఖండన ప్రకటనలు రాలేదు. అనూహ్యంగా టీడీపీ నుంచి పురందేశ్వరికి మద్దతు లభిస్తోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి ఆ పార్టీలోనే ఉన్న అయ్యన్నపాత్రుడు… పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
నందమూరి కుటుంబం అంటే తులసీవనం లాంటిదని .. ఆ కుటుంబానికి చెందిన పురందేశ్వరిని విమర్శించే అర్హత విజయసాయికి ఉందా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ఒక జైలు పక్షి.. గంజాయి వనంలో గంజాయి మొక్కలాంటివాడని మండిపడ్డారు. నిజానికి పురందేశ్వరికి టీడీపీకి అసలు పొసగదు. ఆమె చంద్రబాబు పేరు కూడా ఎత్తరు. అయితే.. టీడీపీపై ఎన్ని విమర్శలు చేసినా..రాజకీయంగా కౌంటర్ ఇచ్చే విషయంలో టీడీపీ నేతలు ఆచితూచి వ్యవహరిస్తారు. విమర్శలు హద్దు దాటనీయరు. అయితే.. ఇతర పార్టీల నేతలు ఆమెపై విమర్శలు చేసినప్పుడు మాత్రం స్పందించడం అరుదు. ఇప్పుడు అయ్యన్నపాత్రుడు స్పందించారు.
పార్టీ పరంగా అయితే స్పందించలేదని.. ఎన్టీఆర్ కుటుంబంపై ఉన్న అభిమానంతో స్పందించి ఉంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు.. విజయసాయిరెడ్డి లాంటి నేత చేస్తున్న వ్యాఖ్యలను తప్పనిసరిగా ఖండించాల్సిందేనని అంటున్నారు. మొత్తానికి బీజేపీ నేతలు విజయసాయిరెడ్డికి ట్విట్టర్లో మాత్రమే ఓ మాదిరి వార్నింగ్ ఇచ్చి ఊరుకున్నారు. అయ్యన్న మాత్రం ఆమెకు మద్దతుగా గట్టి ప్రకటనలే చేస్తున్నారు.