ఐపీఎల్ అంటే కలగూరగంప. ముఖ్యంగా ఓవర్సీస్ స్టార్ ప్లేయర్లంతా ఒకే చోట కనిపిస్తారు. సాధారణంగా ఐపీఎల్లో వాళ్ల జోరే ఎక్కువగా కనిపిస్తుంది. ఉపఖండం పిచ్‌లకు బాగా అలవాటు పడడానికి ఐపీఎల్ వాళ్లకు ఓ వేదిక. భారతలో మ్యాచ్‌లంటే చెలరేగిపోతారు. అయితే ఈసారి దుబాయ్‌లో ఐపీఎల్ జరుగుతోంది. సెంటిమెంట్‌కి విరుద్ధంగా… విదేశీ బ్యాట్స్మెన్ల స్థానంలో భారత బ్యాట్స్‌మెన్ చెలరేగిపోతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచులలో మనవాళ్లదే హవా.
ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ ఇప్పుడు కె.ఎల్.రాహుల్ దగ్గర ఉంది. మూడు మ్యాచ్‌లలో ఏకంగా 222 పరుగులు సాధించాడు రాహుల్. అందులో ఓ సెంచరీ కూడా ఉంది. రెండో స్థానంలో మయాంక్ అగర్వాల్ (221) ఉన్నాడు. రాహుల్ కీ, మయాంక్ కీ తేడా ఒక్క పరుగే. ఇద్దరూ పంజాబ్ తరపున ఆడుతున్నారు. ఈసీజన్లో ఇప్పటి వరకూ పంజాబ్ అగ్రస్థానంలో ఉందంటే..కారణం వీళ్లే. సంజూ శాంసంగ్ 3 మ్యాచ్‌లలో 159 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 16 సిక్సులున్నాయి. బెంగళూరు ఓపెనర్ పడిక్కల్ 111 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ (100), పంత్, మనిష్ పాండే, గిల్.. వీళ్లంతా పరుగులు రాబడుతున్నారు. స్టార్ ప్లేయర్లు కోహ్లి, హార్దిక్ పాండ్యా, ధోనీ లాంటి వాళ్లు తడబడుతున్న పిచ్‌లపై.. కుర్ర గ్యాంగ్ రెచ్చిపోయి సిక్సులు బాదుతున్నారు. సంజూ శాంసంగ్, గిల్, పడిక్కల్ వీళ్లంతా భారతజట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నవాళ్లే. ఈ ఐపీఎల్ ప్రదర్శన తో సెలక్టర్ల దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే స్టార్ బ్యాట్స్మెన్లను తలదన్నేలా ప్రదర్శన చేస్తున్నారు. రాబోయే మ్యాచ్‌లలో వీళ్లెలా ఆడతారన్నది ఆసక్తి రేపుతోంది. తమది ఆరంభ శూరత్వం కాదని నిరూపించుకోవాలంటే ఈ నిలకడ, దూకుడు.. ముందు కూడా కొనసాగించాల్సిందే.