క్రేజ్ ఎటువైపు ఉంటే అటువైపు తిరుగుతాయి సినిమా కళ్లు. పాపులారిటీని క్యాష్ చేసుకోవడం సినిమా వాళ్లకు బాగా తెలుసు. అందుకే… ఇప్పుడు అందరి కళ్లూ… సోనూసూద్ పై పడ్డాయి. లాక్ డౌన్ సమయంలో… రకరకాల రూపంలో సేవ చేసి రియల్ హీరో అవతారం ఎత్తాడు సోనూ. నేషనల్ మీడియా సైతం సోనూని పొగడ్తలతో ముంచెత్తింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, వ్యవస్థలు చేయాల్సిన పని.. తానొక్కడే చేస్తుండడంతో – అందరి చేతా శభాష్ అనిపించుకున్నాడు.
లాక్ డౌన్ తరవాత తొలిసారి హైదరాబాద్ లో అడుగుపెట్టాడు సోనూ సూద్. `అల్లుడు అదుర్స్` లో సోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తతుం ఆర్ఫ్సీలో షూటింగ్ జరుగుతోంది. సోనూ అక్కడే ఉన్నాడు. దాంతో.. సోనూని కలవడానికి దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. కొత్త కథలు, పాత్రలూ సోనూని వెదుక్కుంటూ వెళ్తున్నాయి. ఈరెండు రోజుల్లో సోనూని ఆరుగురు దర్శకులు కలిసి కథలు చెప్పారని సమాచారం. అందులో కొన్ని విలన్ పాత్రలుంటే.. ఇంకొన్ని హీరో కథలున్నాయని సమాచారం. త్వరలోనే సోనూసూద్ కథానాయకుడిగా ఓ అగ్ర నిర్మాణ సంస్థ సినిమా మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. నాలుగైదు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలకు సోనూ బుక్కయిపోయాడు కూడా. సోనూ చేసిన మంచి పనులకు ఇది గుర్తింపు కావొచ్చు. లేదా.. సోనూ సినిమాలో ఉంటే క్రేజ్ పెరుగుతుందని నిర్మాతలు భావించొచ్చు. నిజానికి.. సోనూలో ఓ మంచి నటుడున్నాడు. రొటీన్ విలన్ పాత్రల్ని సైతం స్టైలీష్‌గా చేయగలడు. తనలోని నటుడికి ఎప్పుడో మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఆ ఫలితమూ కనిపిస్తోందని అనుకోవాలి.