ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. కారణాలేమిటో తెలియదు కానీ..గురువారం జరగాల్సిన కేబినెట్ భేటీని ఎనిమిదో తేదీకి మారుస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇప్పటికిప్పుడు కేబినెట్ భేటీని వాయిదా వేసేంత పెద్ద కారణం ఏమీ లేదు. ముఖ్యమంత్రికి ఇతర అధికారిక పర్యటనలు లేవు. వ్యక్తిగత కార్యక్రమాలు కూడా లేవు. అయినప్పటికీ.. కేబినెట్ భేటీని వాయిదా వేయడం ఆసక్తికరంగా మారింది. ఇదే మొదటి సారి కాదు.. అసలు మొదటగా సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలనుకున్నారు. కానీ ఒకటో తేదీకి వాయిదా వేశారు.
ఈ వాయిదా విషయం కూడా ఐదు రోజుల ముందే అంటే 21వ తేదీనే ప్రకటించారు. ఇప్పుడు.. ఒక్క రోజు ముందుగా వాయిదా వేశారు. ఇరవై మూడో తేదీన బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు మంత్రులు వెల్లంపల్లి , చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలకు కరోనా సోకింది. మరికొంత మంది ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉన్న వారికీ పాజిటివ్‌గా తేలింది. ఈ కారణంగా మంత్రులు కేబినెట్ భేటీకి హాజరు కావడం ఇబ్బంది అని.. వాయిదా వేసినట్లుగా భావిస్తున్నారు.
అదే సమయంలో… కరోనా పాజిటివ్ వచ్చిన వారితో సీఎం జగన్ ఫస్ట్ కాంటాక్ట్‌గా ఉన్నారు కనుక.. నిబంధనలు పాటిస్తున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. కారణం చెప్పకుండా పదే పదే కేబినెట్ భేటీల్ని వాయిదా వేస్తే… అనేక రకాల చర్చలు ప్రజల్లో జరుగుతాయి. అసలు వాయిదాకు కారణం ఏమిటో చెబితే… మొత్తానికి ఆ ఇష్యూ తెరపడుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో గోప్యతనే పాటిస్తోంది.