కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో బలపడటానికి అగ్రెసివ్ మార్గాన్ని ఎంచుకుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్ల బిగింపు నిర్ణయంపై దూకుడుగా వెళ్లి రైతాంగంలో మద్దతు పెంచుకుని ఓటు బ్యాంక్‌ను ప్రభావవంతంగా పెంచుకోవాలి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సీపీఐ ఈ విషయంలో మరింత ఫాస్ట్‌గా ఉంది. బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడంతో దూకుడుగా ఉండే సీపీఐ నేత నారాయణ ఈ విషయంలో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ మీటర్లు బిగించడానికి వచ్చే వాడి చేతులు మిగలవని హెచ్చరికలు జారీ చేశారు.
సీఎంకు చేతనైతే విద్యుత్ మీటర్లు బిగించి చూడాలని కూడా సవాల్ చేశారు. రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో ఉచిత విద్యుత్‌ను సాధించుకుంటే.. ఆయన కొడుకే దానికి మంగళం పాడుతున్నాడని మండిపడ్డారు. విద్యుత్ మీటర్ల విషయంలో ఇప్పటికే రైతుల్లో ఆందోళన ప్రారంభమయింది. కేంద్రం తప్పనిసరిగా పెట్టాలంటోందని ప్రభుత్వం తన వాదనగా చెబుతున్నప్పటికీ..పొరుగు రాష్ట్రం తెలంగాణ మంత్రులు మాత్రం..కేవలం రూ.నాలుగు వేలకోట్ల కోసం జగన్ …రైతుల గొంతు కోస్తున్నారని ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలకు తోడు మీటర్లు పెడితే వచ్చే అనేక సమస్యలు రైతుల కళ్ల ముందు కనిపిస్తున్నాయి. దీంతో వారు కూడా వ్యతిరేకిస్తున్నారు.
ఈ వ్యతిరేకతను అండగా చూసుకుని రాజకీయ పార్టీలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. మీటర్లు పెడితే కాలబెడతామని.. శ్రీకాకుళం నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని గతంలోనే కమ్యూనిస్టులు ప్రకటించారు. ఇప్పుడు పెట్టి చూడండి అని సవాల్ చేస్తున్నారు. సీపీఐ నారాయణ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడంతో దూకుడుగా ఉంటారు. మరి ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటే ఏం చేస్తుందో..!?