లాక్డౌన్ కారణంగా ఆదాయం పడిపోవడంతో మూడు నెలల పాటు కోత పెట్టిన జీతాన్ని మూడు వాయిదాల్లో చెల్లించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు విధానమైన నిర్ణయాలను ఆదేశాలను జారీ చేశారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్ల ఉద్యోగులకు సగం మాత్రమే జీతాలు చెల్లించారు. పెన్షనర్లకూ అంతే. ప్రజా ప్రతినిధులకు ఇంకా ఎక్కువ కట్ చేశారు. ఇప్పుడు ఆదాయం మెరుగుపడటంతో ఉద్యోగుల జీతాలను మూడు వాయిదాల్లో , పింఛనుదారులకు రెండు వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరు, నవంబరులో పెన్షనర్లకు.. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరులో జీతాలు చెల్లిస్తారు.
ఒకే సారి ఇచ్చే పరిస్థిి లేదని వాయిదాల్లో చెల్లిస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు కొద్ది రోజుల కిందట ప్రకటన చేశాురు. దాని ప్రకారం.. రానున్న రోజుల్లో ఆదాయాన్ని మదింపు చేసుకుని… పెన్షనర్లకు రెండు విడతలు.. ఉద్యోగులకు మూడు విడతల్లో చెల్లించాలని నిర్ణయించారు. ఇలా జీతాలు కట్ చేయడం చట్ట విరుద్ధమని చెబుతూ.. కొంత మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఏ చట్టం ప్రకారం ఇలా జీతాలు కత్తిరించారో చెప్పాలని కోర్టులు కూడా ప్రభుత్వాన్ని వివరణ అడిగాయి. ఇలాంటి చట్టపరమైన చిక్కులు వస్తాయని అంచనా వేసిన ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే చెల్లించక తప్పదని న్యాయనిపుణులు చెప్పడంతో ఇప్పుడు వాయిదాల పద్దతిలో చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వం కూడా రెండు నెలల పాటు జీతాలు, పెన్షన్లు నిలిపివేసింది. వాటిని పన్నెండు శాతం వడ్డీతో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల పదకొండో తేదీతో ఆ గడువు ముగుస్తుంది. అయితే.. చెల్లింపుల ప్రక్రియ కోసం ఎలాంటి ప్రణాళికనూ ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు. తెలంగాణలో ఆదాయం సాధారణ స్థితికి వచ్చింది. కానీ ఏపీలో మాత్రం.. ఇంకా పనులు ఊపందుకోలేదు. ప్రభుత్వ విధానాల వల్ల కూడా ఆదాయం భారీగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో.. మళ్లీ అప్పు దొరికితే.. అందరికీ బకాయిలు చెల్లిస్తారు. లేకపోతే.. కోర్టును మరింత సమయం కోరే అవకాశం ఉంది.