కడప జిల్లా జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గత నాలుగు నెలలుగా తెదేపాలో చేరేందుకు ఎదురు చూస్తున్నారు. అదే నియోజకవర్గానికి చెందిన తెదేపాలో ఆయన రాజకీయ ప్రత్యర్ధి రామసుబ్బారెడ్డి ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కారణంగా ఇంతవరకు ఆదినారాయణ రెడ్డి తెదేపాలో చేరలేకపోయారు. తాజా సమాచారం ప్రకారం ఆయన పార్టీలో చేరేందుకు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. అంటే రామసుబ్బారెడ్డిని ఒప్పించి అయినా ఉండాలి లేదా వదులుకోవడానికయినా చంద్రబాబు నాయుడు సిద్దపడి ఉండాలి. తన రాజకీయ ప్రత్యర్ధిని పార్టీలో తీసుకోవడానికి మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రామసుబ్బారెడ్డి చంద్రబాబు నాయుడు మాట మన్నించి ఒప్పుకొన్నా, ఆ తరువాత నిత్యం ఆదినారాయణ రెడ్డితో సమస్యలు, సవాళ్ళు, ఎన్నికల సమయంలో అతని నుండి టికెట్ కోసం పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఆదినారాయణ రెడ్డిని తెదేపా చేర్చుకొన్నట్లయితే, అందుకు నిరసనగా రామసుబ్బారెడ్డి పార్టీని వీడే అవకాశం ఉంటుంది.