ఈనెల 15 నుంచి కేంద్ర ప్రభుత్వం థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. అయితే… నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంచింది. థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో తెలుగు ప్రభుత్వాలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. నిర్మాతలు మాత్రం 50 శాతం సిట్టింగ్ అంటే… సినిమాల్ని విడుదల చేసుకోవడం కష్టం అంటూ చేతులెత్తేస్తున్నారు. కానీ థియేటర్ యాజమాన్యం మాత్రం `థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు ఇవ్వండి` అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి.
ఈ మేరకు తెలంగాణ థియేటర్ల యాజమాన్య సంఘం ఈ రోజు హైదరాబాద్ లో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిమితులకు లోబడి, థియేటర్లని తెరచుకుంటామని, 50 శాతం సిట్టింగ్ కి తమకెలాంటి అభ్యంతరం లేదని, అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటామని, మాస్క్ ఉన్నవారినే థియేటర్లోకి అనుమతి ఇస్తామని – అభ్యర్థిస్తోంది. లాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూతబడడంతో చాలామంది ఉద్యోగులు ఉపాథి కోల్పోయాయని, జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని, ఇప్పటికే థియేటర్ వ్యవస్థపై విపరీతమైన ప్రభావం పడిందని, మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే, థియేటర్ల మనుగడకే కష్టమని థియేటర్ యజమానులు వాపోతున్నారు.
థియేటర్లకు అనుమతులు వస్తే, పెద్ద సినిమాలు రాకపోయినా, కొంతకాలం చిన్న చిత్రాలతో నెట్టుకురావొచ్చన్నది థియేటర్ యజమానుల ఉవాచ. క్రమంగా ప్రేక్షకులు థియేటర్లో సినిమా చూడ్డానికి అలవాటు పడతారని, ఆ తరవాత పెద్ద సినిమాలు విడుదల అవుతాయని, ఈలోగా… కనీసం ఉద్యోగులకైనా ఉపాధి దొరుకుతుందని థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?