ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజూ సీబీఐ కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను రోజువారీగా విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు సూచనల మేరకు.. తెలంగాణ హైకోర్టు.. ఈ మేరకు తన పరిధిలో ఉన్న న్యాయస్థానాలన్నింటికీ స్పష్టమైన సూచనలు చేసింది. చీఫ్ జస్టిస్ ఈ అంశంపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేగంగా విచారణ ఎలా పూర్తి చేయాలన్నదానిపై ఇతర న్యాయాధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కేసును రెండు వర్గాలుగా వర్గీకరించారు. , ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, రైల్వే, ప్రజాప్రాతినిధ్య చట్టానికి సంబంధించిన కేసులు 118 ఉన్నాయి.
ఇక అత్యంత తీవ్ర నేరాలయిన సీబీఐ, ఏసీబీ, మనీలాండరింగ్ చట్టాల కింద నమోదైన కేసులు ఇరవై ఐదు ఉన్నాయి. ఇందులో సగానికిపైగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించినవి. ఆయన అక్రమాస్తుల కేసుల్లో పదుల సంఖ్యలో వైసీపీ నేతలు ఉన్నారు. ప్రజాప్రతినిధులైన వారు కూడా ఉన్నారు. వీటికి సంబందించి 2011లో ఎఫ్ఐఆర్ నమోదయింది. 2012లో నాలుగుకేసుల్లో, 2013లో ఆరు కేసుల్లో , 2014లో మరో కేసులో చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు కింది కోర్టు నుంచి పైకోర్టు వరకు అనేక స్థాయిలో వివిధ పిటిషన్లు వేశారు. ఫలితంగా విచారణ ఆలస్యంగా సాగుతూ వచ్చింది. ఈ లోపు కొన్ని కేసుల్లో హైకోర్టు స్టేలు మంజూరు చేయగా, మిగిలిన వాటిపై వాదనలు ఇంకా ఇంకా కొనసాగుతున్నాయి.
ఒక్క జగన్ కేసులు కాకుండా.. ఇతర ప్రజా ప్రతినిధులపై కూడా కేసులు ఉన్నాయి. ఇలా ఉన్న కేసుల్లో 14 కేసులపై స్టే ఉంది. వీటన్నింటినీ తేల్చాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శరవేగంగా కసరత్తు చేసేందుకే సీజే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినట్లుగా భావిస్తున్నారు. విచారణలు ప్రారంభమైతే నిందితులంతా రోజువారీగా విచారణకు హజరు కావాల్సి ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు కోసం పెట్టుకున్న పిటిషన్లు కోర్టులు కొట్టి వేశాయి. ఈ కారణంగా ఆయన ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారు. కరోనా కారణంగావిచారణలు వాయిదా పడ్డాయి కాబట్టి.. ఆయనకు రిలీఫ్ లభించింది.
హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వయంగా ప్రజాప్రతినిధులపై కేసుల సంగతిని తేల్చాలనుకుంటున్నారు కాబట్టి.. రోజువారీ విచారణ వేగంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రోజూ కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థతి వస్తే ఇక సీఎం జగన్.. తన అధికార విధుల్ని నిర్వహించడం కష్టంగా మారొచ్చు. ఈ అంశంపై ప్రస్తుతం వైసీపీలోనూ చర్చ ప్రారంభమయింది. వచ్చే రెండు మూడు నెలల్లో కీలక పరిణామాలు ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు.