కరోనా కాలంలో చితికిపోతున్న చిత్రసీమనీ, నిర్మాతల్నీ ఒడ్డున పడేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు పారితోషికాలు తగ్గించుకోవాల్సిందేనన్న మాట ఈమధ్య మరింత బలంగా వినిపిస్తోంది. ఇటీవల ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ కీలకమైన సమావేశం నిర్వహించి, హీరో, హీరోయిన్లు.. ఇతర సాంకేతిక నిపుణులకు పారితోషికాలు తగ్గించుకోవాలని విన్నవించుకుంది. ఇప్పుడు మరో అడుగుముందుకేసి నటీనటులు 20 శాతం పారితోషికాలు తగ్గించుకోవాలన్న ప్రతిపాదన చేసింది. దానికి.. `మా` సైతం అంగీకరించింది. 5 లక్షలు కంటేఎక్కువ పారితోషికం తీసుకునే నటీనటులంతా విధిగా 20 శాతం పారితోషికాలు తగ్గించుకోవాల్సివుంటుంది. 20 వేలు, అంతకంటే తక్కువ తీసుకునే వాళ్లకు ఈ నిబంధన వర్తించదు. 20 వేలు దాటిన తరవాత.. డిస్కౌంట్ టారీఫ్ మారుతూ ఉంటుంది.
ఈ ఎఫెక్ట్ కోట్లకు కోట్లు తీసుకునే కథానాయకులపై ఎక్కువ పడుతుంది. స్టార్ హీరోల పారితోషికాలన్నీ 20 కోట్లకు పైమాటే. మహేష్, ప్రభాస్ లాంటి వాళ్లు 50 కోట్లు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు అందులో 20 శాతం తగ్గింపు ఇవ్వాలన్న మాట. ఇది వరకు పారితోషికాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ బ్లాకులో నడిచేవి. అగ్రిమెంట్లలో ఉన్న పారితోషికం వేరు, నిజంగా ఇచ్చే పారితోషికం వేరు. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. అంతా వైట్ లోనే సాగుతోంది. కాబట్టి.. హీరోలు పారితోషికాలు తగ్గించుకోవాల్సిందే. అందుకు మరో మార్గం లేదు. కానీ అదైనా సవ్యంగా సాగుతుందా, లేదా? అన్నదే డౌటు. నిర్మాతలంతా హీరోల చుట్టూ తిరుగుతున్న రోజులివి. `మీ పారితోషికం 20 శాతం తగ్గించుకుంటారా` అని హీరోల్ని అడిగే ధైర్యం నిర్మాతలకు లేదు. కోరుకున్న హీరో దొరకాలంటే, హీరోలు అడిగినంత ఇవ్వాల్సిందే. 20 శాతం తగ్గింపు అన్నది నిబంధనగా మారితే… దానికి అనుగుణంగానే హీరోలు పారితోషికాలు పెంచుకుని, ఆ తరవాత.. 20 శాతం రిబేటు ఇస్తుంటారు. మరి దానికి నిర్మాతలు సిద్ధమేనా? మార్కెట్ లో చూడండి. ఓ వస్తువు రేటు అమాంతం పెంచి, ఆ తరవాత దానిపై డిస్కౌంట్ ఇస్తుంటారు. ఇప్పుడు హీరోలూ అదే చేస్తారేమో.? ఫలానా హీరో పారితోషికం ఇంత.. అని చెప్పే ఎం.ఆర్.పీ రేట్లేమీ లేవిక్కడ. అలాంటప్పుడు ఓ కథానాయకుడు తన పారితోషికం తగ్గించాడనో, లేదనో ఎలా చెప్పేది. ఇది అయ్యే పనేనా?